
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ ఆదిత్యనగర్‌లో ఉన్న శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్‌లో మధురవాడకు చెందిన నరేష్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్..కోపంతో నరేష్‌ను కొట్టి, షర్ట్ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో బాధిత విద్యార్థి ఇనుప బెంచీపై పడడంతో చెయ్యి విరిగింది. అంతటితో ఆ టీచర్ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్‌ను కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించాడు.
ఇంటికి వెళ్లి విద్యార్థి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు వైద్యం నిమిత్తం నరేష్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నాడు. బుధవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో, గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదంటూ నినదించారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు స్కూల్ యాజమాన్యానికి వంత పాడటం గమనార్హం. ఘటనాస్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్ ఎస్‌ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు.