
ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషించడంతో కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థినులు
గణిత ఉపాధ్యాయునిపై విద్యార్థినుల ఫిర్యాదు
అనంతపురం జిల్లాలో కలకలం
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చిన్నహోతురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, అందువల్ల ఆయన తరగతికి వెళ్లబోమని విద్యార్థినులు కన్నీరు పెట్టుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగిన ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఒక దశలో చేయిచేసుకోబోయారు. తోటి ఉపాధ్యాయులు అతికష్టం మీద తల్లిదండ్రులను ఆపారు. కాగా, గణితం తరగతికి వెళ్లబోమని హెచ్‌ఎంకు విద్యార్థినులు ఈ సందర్బంగా లేఖ అందించారు.
చర్యలకు ఉన్నతాధికారుల సిఫారసు
వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదని విచారణలో తేలడంతో చర్యల కోసం డీఈఓ ప్రసాద్‌బాబుకు సిఫారసు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కాగా, సతీష్ కుమార్ గతంలో చాబాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు, ఆయన వ్యవహారశైలి బాగోకపోవడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అప్పటి ఘటనలపైనా అధికారులు దృష్టి సారించారు.