
విశాఖపట్నం: స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్‌కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాకు ఆర్‌టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.
దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్‌కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు.