‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’

Unable To Conceive Woman Kills Neighbour Son To Please Gods - Sakshi

సాధువు మాటలు నమ్మి చిన్నారిని చంపేసిన మహిళ

న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయినా సరే చేస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇదే కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. తనకు బిడ్డలు పుట్టడం లేదనే బాధతో ఓ మహిళ సాధువును సందర్శించింది. అతడి మాటలు నమ్మి.. తన పక్కింట్లో ఉన్న మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చింది. ఆ తర్వాత మృత దేహాన్ని బ్యాగులో కుక్కి పక్కింటి మేడ మీద పడేసింది. చిన్నారి తల్లిదండ్రులు తమ పిల్లాడు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. ఢిల్లీకి చెందిన నీలం గుప్తకు 2013లో వివాహం అయ్యింది. కానీ ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో అత్తింటివారు.. బంధువులు నీలం గుప్తను సూటి పోటీ మాటలతో హింసిచేవారు. ఈ బాధ తట్టుకోలేక నీలం గుప్త ఓ సాధువును ఆశ్రయించింది. అతడు ‘‘దేవుడు నీ మీద ఆగ్రహంగా ఉన్నాడు.. అందుకే నీకు ఇంకా బిడ్డలు కలగలేదు. దేవుడికి కోపం తగ్గి.. నీకు బిడ్డలు కలగాలంటే ఓ పిల్లాడిని బలి ఇవ్వాలి’’ అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన నీలం గుప్త తన ఇంటి పక్కన ఉంటున్న మూడేళ్ల చిన్నారిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ఇంటి మేడ మీద ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి.. తన ఇంట్లోకి తీసుకెళ్లి చంపేసింది. ఆ తర్వాత బాలుడి శవాన్ని బ్యాగులో కుక్కి ఎదురింటి మేడ మీద పడేసింది. 

తమ బిడ్డ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో వారికి నీలం ఎదురింటి మీద బ్యాగ్‌ కనిపించింది. తెరిచి చూడగా.. దానిలో చిన్నారి మృతదేహం ఉంది. ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. నీలం పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను విచారించగా.. ‘‘బిడ్డను బలి ఇస్తే నాకు సంతానం కలుగుతుందని సాధువు తెలిపాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిన్నారి మా ఇంటి మేడ మీద ఆడుకోవడం చూశాను. తనను తీసుకెళ్లి దేవుడికి బలి ఇచ్చాను. పిల్లలు లేరనే బాధతోనే ఇలా చేశాను’’ అని చెప్పుకొచ్చింది. పోలీసులు నీలంను అరెస్ట్‌ చేశారు. 

చదవండి: ఆస్ప‌త్రి నుంచి పారిపోయి.. శ‌వ‌మై తేలాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top