ఒడ్డుకు రాగానే ఫోన్‌ చేస్తానన్నావు కదమ్మా!

Two Students Drown In Sea At Machilipatnam Beach - Sakshi

కృష్ణా (మచిలీపట్నంటౌన్‌): సరదాగా బీచ్‌లో గడుపుదామని వచ్చిన విద్యార్థినులను రాకాసి అలలు మింగేశాయి. మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్‌(22), అదే మండలం గరగపర్రు గ్రామానికి చెందిన దత్తల ఆశాజ్యోతి భీమవరంలోని విష్ణు కాలేజీలో బీ–ఫార్మసీ చదువుతున్నారు. ఈ నెల 21వ తేదీతో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు ముగియటంతో జాస్మిన్, ఆశాజ్యోతి కలసి స్నేహితురాలు పూజితతో మచిలీపట్నం వచ్చారు. పూజిత ఇంటి వద్ద ఆదివారం ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాకాసి అల దాడితో ముగ్గురూ నీళ్లలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ఆశాజ్యోతిని రక్షించగలిగారు. పూజిత, జాస్మిన్‌లను మెరైన్‌ పోలీసులు గాలించి ఒడ్డుకు చేర్చినా, అప్పటికే వారిరువురు మృతి చెందారు. రూరల్‌ ఎస్‌ఐ జి.వాసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను 108లో బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. 

ఒడ్డుకు రాగానే ఫోన్‌ చేస్తానన్నావు కదమ్మా!
అమ్మా! నేను బీచ్‌లో స్నానానికి వెళుతున్నా.. ఒడ్డుకు రాగానే నేనే ఫోన్‌ చేస్తా... ఈలోపు నువ్వు  చేయొద్దని చెప్పావు... సముద్రంలోకి వెళ్లి మాయ మైపోయావా అమ్మా..అంటూ జాస్మిన్‌ తల్లి కాకర్ల సుభాషిణి భోరున విలపించటం చూపరులను కలచివేసింది. జాస్మిన్‌ మృతి వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు అగస్టీన్, సుభాషిణి, సోదరుడు రాజు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జాస్మిన్‌ తండ్రి పిప్పర లోని పెంతెకోస్తు చర్చి పాస్టర్‌. తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెను తలుచుకుంటూ రోదించటం స్థానికులను కంట తడి పెట్టించింది. 

​​​​​​​

కానరాని లోకాలకు తరలిపోయావా తల్లీ!
బీచ్‌లో తమ కుమార్తె పూజిత, ఆమె స్నేహితురాలు జాస్మిన్‌ మృతి చెందిన వార్త తెలుసుకున్న పూజిత తండ్రి కృష్ణవరప్రసాద్, తల్లి లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్పకూలిపోయారు. పూజిత మృతదేహంపై పడి భోరున విలపించారు. బందరు మండలం గుండుపాలెంకు చెందిన కృష్ణవరప్రసాద్‌ పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. పెద్దకుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్వగ్రామం గుండుపాలెం నుంచి కొన్నేళ్ల క్రితం నగరంలోని పరాసుపేటకు వచ్చి నివసిస్తున్నారు. శనివారం చివరి పరీక్ష కావటంతో  కృష్ణవరప్రసాద్‌ భీమవరం కారు వేసుకుని వెళ్లి కుమార్తె పూజితతో పాటు ఆమె స్నేహితురాళ్లు జాస్మిన్, ఆశాజ్యోతిలను బందరు తీసుకువచ్చారు.  

జూన్‌ 1న కోయంబత్తూరు ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం 
పూజిత, నేను జూన్‌ 1న కోయంబత్తూరుకు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం. మేమిద్దరం క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాం. ఈలోగా ఇలా జరిగింది. కలిసి ఆనందంగా గడిపిన మా ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. 
– ఆశాజ్యోతి, మృత్యుంజయురాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top