బండారం బట్టబయలు: బుల్లెట్‌పై దొరల్లా వచ్చి... | Two Robbers Arrested For Theft In East Godavari | Sakshi
Sakshi News home page

దొరల్లా వస్తారు.. దోచుకుపోతారు 

Mar 21 2021 10:26 AM | Updated on Mar 21 2021 10:54 AM

Two Robbers Arrested For Theft In East Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అదే సమయంలో బుల్లెట్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రాజమహేంద్రవరం వెళ్తున్నామని నమ్మించి, అతడిని తమ బైక్‌ ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ చిరు వ్యాపారిని కొట్టి, అతడి వద్ద ఉన్న రూ.వెయ్యి నగదు, సెల్‌ఫోన్, ఒక ఎలక్ట్రానిక్‌ కాటా అపహరించారు.

జగ్గంపేట(తూర్పుగోదావరి): తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఒక దారి దోపిడీపై విచారణ ప్రారంభించిన గండేపల్లి పోలీసులకు.. లారీల్లో చోరీలకు పాల్పడుతున్న 23 ఏళ్ల యువకులు ఇద్దరు పట్టుబడ్డారు. దొరల్లా కనిపిస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న రంగంపేటకు చెందిన యారసాని శ్రీకాంత్, గుత్తుల సత్తిబాబులను గండేపల్లి ఎస్సై శోభన్‌ కుమార్, సిబ్బంది రాజానగరం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 20 సెల్‌ఫోన్లు, 2 మోటారు సైకిళ్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగ్గంపేట సీఐ సురేష్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. ఈ నెల ఐదో రాత్రి రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఓ చిరు వ్యాపారి జగ్గంపేటలో వేచి ఉన్నాడు. అదే సమయంలో బుల్లెట్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రాజమహేంద్రవరం వెళ్తున్నామని నమ్మించి, అతడిని తమ బైక్‌ ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ చిరు వ్యాపారిని కొట్టి, అతడి వద్ద ఉన్న రూ.వెయ్యి నగదు, సెల్‌ఫోన్, ఒక ఎలక్ట్రానిక్‌ కాటా అపహరించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గండేపల్లి పోలీసులు విచారణ ప్రారంభించారు. దోపిడీకి గురైన వ్యక్తి ఇచ్చిన ఆధారాల మేరకు రంగంపేటకు చెందిన ఆ ఇద్దరు యువకులపై పోలీసులు నిఘా పెట్టారు. దారి దోపిడీకి వారే బాధ్యులు అని నిర్ధారణకు రావడంతో వారిని రాజానగరం వద్ద అరెస్టు చేశారు.

ధాబాల వద్ద లారీల్లో చోరీలు 
నిందితులు శ్రీకాంత్, సత్తిబాబుల హంగు, ఆర్భాటం చూస్తే వారు గొప్ప ధనవంతుల బిడ్డలని అనుకుంటారు. జాతీయ రహదారుల పక్కన ఉన్న ధాబాల వద్ద కనిపించే ఆ ఇద్దరిలో ఒకరు బుల్లెట్, మరొకరు ఖరీదైన మోటార్‌ సైకిల్‌పై వస్తారు. కాసేపు అక్కడే ఉంటారు. లారీలు ఆపి భోజనం చేస్తున్న డ్రైవర్లను గమనిస్తారు. కన్నుమూసి తెరిచేలోపు వారి లారీల్లోకి చొరబడి సెల్‌ఫోన్లు నగదు దోచుకుంటారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగినప్పటికీ పోలీసులకు ఫిర్యాదులు అందలేదు.

డ్రైవర్లు దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో చాలా దూరం వెళ్లిన తరువాత కానీ చోరీ జరిగిన విషయాన్ని వారు గమనించడం లేదు. ఒకవేళ చోరీ జరిగిన సంగతి గుర్తించి ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో ఆలస్యం అవుతుందని, అందువల్లనే ఎవ్వరూ ఫిర్యాదు చేసి ఉండకపోవచ్చునని సీఐ సురేష్‌బాబు తెలిపారు. భారీగా నగదు, బంగారంతో ఎవరైనా దొరుకుతారేమోనని శ్రీకాంత్, సత్తిబాబు స్కెచ్‌ వేసుకున్నారని, కానీ ఈలోగానే వారి బండారం బయట పడిందని చెప్పారు. ధాబాల వద్ద భోజనాలకు ఆగేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో గండేపల్లి ఎస్సై శోభన్‌ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement