
తిరుమలంపాలెంలోని రామాలయం వద్ద బాలిక వివాహాన్ని అడ్డుకుని, పలువురికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రేమ పేరుతో ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు మైనర్ బాలికలను మోసగించి, ఆనక ముఖం చాటేశారంటూ.. కుల పెద్దలు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా అన్నదమ్ముల్లో తమ్ముడికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో వివాహం చేశారు. మరుసటిరోజు సోమవారం ఉదయం అన్నయ్యకు వివాహం జరిపే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని తిరుమలంపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికుల కథనం ప్రకారం. కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు(ఒకరి వయస్సు 16, మరొకరి వయస్సు 17) తమను ఇద్దరన్నదమ్ములు మోసగించి, గర్భవతులను చేశారంటూ కుల పెద్దలను ఆశ్రయించారు. దీనిపై ఆదివారం రాత్రి కాలనీలోని రామాలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. అనంతరం బాలికలకు, అన్నదమ్ములతో వివాహం జరపాలని తేల్చారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అన్నదమ్ముల్లో మైనరైన(17 ఏళ్ల వయస్సు గల) తమ్ముడికి, 7 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం మేజరైన అన్నయ్యకు, 8 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపే ప్రయత్నం చేశారు.
ఫిర్యాదు అందడంతో..
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, కాలనీలోని రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకున్నారు. అక్కడున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే తమను మోసగించి, గర్భవతులను చేసింది ముమ్మాటికీ ఈ ఇద్దరు అన్నదమ్ములేనని బాలికలు అంటుంటే, తమకు ఏమాత్రం సంబంధం లేదని, కావాలని కుల పెద్దలు, బాలికల తరపువారు తమను ఇందులో ఇరికిస్తున్నారని అన్నదమ్ములు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే ఈ అన్నదమ్ములకు చెందిన తోటలోకే బాధిత బాలికలు పొలం పనులకు వెళ్తుంటారని స్థానికులు చెప్పారు.
రాజీకి యత్నాలు..
పోలీస్టేషన్‌కు చేరిన ఇరు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు రాజీకి యత్నించారు. గ్రామంలో మరోమారు తాము చర్చించుకుని వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటన గ్రామంలో తీవ్ర అలజడిని సృష్టించింది. బాలికలకు నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.