3 వేల కోసం ముగ్గురిని చంపాడు

Thief Killed Three People For Money In Nizamabad District - Sakshi

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో దారుణ హత్యలు పాత నేరస్తుడి పనే..

చిన్న వయసు నుంచే దొంగతనాలు.. అడ్డువచ్చిన వారిపై దాడులు 

ఇప్పటికే కొన్నేళ్లు జైలుశిక్ష.. బయటికొచ్చిన రెండు నెలల్లో మరో దారుణం 

నిజామాబాద్‌ అర్బన్‌: చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి.. 16ఏళ్ల వయసులోనే హత్యాయత్నం చేసి మూడేళ్లు జైలుకెళ్లాడు.. బయటికొచ్చి రెండు నెలలైనా కాలేదు.. డబ్బుల కోసం దొంగతనాలు మొదలుపె ట్టాడు. రూ.3 వేల కోసం ముగ్గురిని కిరాతకం గాచంపేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 8న నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి శివారులో ముగ్గురు హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు గంధం శ్రీకాంత్‌ అలియాస్‌ మల్లేశ్‌ (19)ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మీడియాకు వెల్లడించారు. 

చిన్నప్పటి నుంచే నేరాలతో.. 
నవీపేట మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీకాంత్‌ అలియాస్‌ మల్లేశ్‌కు చిన్న వయసు నుంచే నేర చరిత్ర ఉంది. నిజామాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు దొంగతనాలు చేసి జువైనల్‌ హోంలో శిక్ష అనుభవించాడు. 2016లో నిజామాబాద్‌ హమాలీవాడిలోని సాయిబాబా ఆలయంలో హుండీని దొంగిలించేందుకు యత్నించాడు. అడ్డువచ్చిన వాచ్‌మన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనకు సంబంధించి మూడేళ్లు జైల్లో ఉన్న శ్రీకాంత్‌.. అక్టోబర్‌ 13న విడుదలయ్యాడు. అప్పటి నుంచి నిజామాబాద్‌లోని గాజుల్‌పేట్‌(కడ్డా) ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. 

దొంగతనం కోసం వెళ్లి.. 
ఈ నెల 8న రాత్రి నిజామాబాద్‌లోని మిర్చి కాం పౌండ్‌లో మద్యం తాగిన శ్రీకాంత్‌.. డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడేందుకు బస్సు ఎక్కి డిచ్‌పల్లికి వెళ్లాడు. అక్కడి ఓ గ్యారేజీలో పంజాబ్‌ చెందిన హర్పాల్‌సింగ్‌ (33), జోగిందర్‌సింగ్‌ (48), సంగా రెడ్డి జిల్లాకు చెందిన బానోత్‌ సునీల్‌ (22) నిద్రపోతుండటం చూశాడు. తొలుత గ్యారేజీ ఆవరణలో నిద్రిస్తున్న సునీల్‌ వద్ద డబ్బు, సెల్‌ఫోన్‌ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సునీల్‌ మేల్కొ నడంతో సుత్తితో తలపై కొట్టాడు.

లోపల నిద్రిస్తున్న హర్పాల్‌సింగ్, జోగిందర్‌సింగ్‌లనూ తలపై సుత్తితో మోది చంపేశాడు. వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదు తీసుకుని పరారయ్యాడు. ఒకేచోట జరిగిన ఈ ముగ్గురి దారుణహత్యలు కలకలం రేపాయి. పోలీసులు  సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు పాత నేరస్తులపై నిఘా పెట్టారు. ఈ క్రమం లో గాజుల్‌పేట్‌ ప్రాంతంలో తనిఖీలు చేసి.. శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. అతడి గదిలో రక్తం మరకలు ఉన్న చొక్కాను, ఎత్తుకెళ్లిన మూడు సెల్‌ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top