మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం' | Telangana High Court Not Ordered CBI Probe Into Mariamma Lockup Death | Sakshi
Sakshi News home page

మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం'

Nov 23 2021 1:19 AM | Updated on Nov 23 2021 9:55 AM

Telangana High Court Not Ordered CBI Probe Into Mariamma Lockup Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో సమర్థంగా దర్యాప్తు చేసే సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలున్నాయని, సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. మానవ హక్కుల కమిషన్‌ మార్గదర్శకాలకు లోబడి దర్యాప్తు జరుగుతోందని, లాకప్‌డెత్‌కు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇతర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

లాకప్‌డెత్‌ ఘటనపై న్యాయ విచారణతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత జయవింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. 

ఆదేశిస్తే మేము సిద్ధం: సీబీఐ 
న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. మరియమ్మ గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కల్యాణ్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐపై పనిభారం ఉందా అని ధర్మాసనం కల్యాణ్‌ను ప్రశ్నించగా.. ధర్మాసనం ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తును సమర్థంగా చేస్తారని, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ఏజీ అభ్యర్థించారు.

మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని, ఇంట్లో ఒకరికి ఉపాధి కల్పించామని నివేదించారు. దర్యాప్తులో ఎవరైనా బాధ్యులని తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ సంబంధన్‌ కూడా ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement