Chilakaluripet: టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి

TDP Leaders Attack On Woman Officer At Chilakaluripet - Sakshi

అనుమతిలేని వాటర్‌ ప్లాంట్‌ పునఃప్రారంభం పేరుతో నానా రభస

మాజీమంత్రి పత్తిపాటి నాయకత్వంలో రెచ్చిపోయిన నేతలు

మునిసిపల్‌ అధికారులు, పోలీసులను లెక్కచేయని పచ్చమూకలు

చిలకలూరిపేట(పల్నాడు జిల్లా): అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్‌ ప్లాంట్‌ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగింది. వివరాలివీ..
చదవండి: సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే ‍కారణమా..?

చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్‌ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్‌ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు.

పోలీసులను తోసేసి వాటర్‌ప్లాంట్‌లోకి ప్రవేశిస్తున్న పత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు  

మహిళా అధికారిణిపై దాడి
ప్లాంట్‌ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ (టీపీఎస్‌) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్‌ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్‌ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్‌ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. ఈ గందరగోళం ఇలా జరుగుతుండగానే పుల్లారావు ప్లాంటులోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టేశారు.

ఆసుపత్రిలో టీపీఎస్‌ సునీత చేరిక
మరోవైపు.. సంఘటనలో గాయపడ్డ సునీతను మునిసిపల్‌ సిబ్బంది ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత విడదల గోపి, మునిసిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దిరాల విశ్వనాథం, మాజీ చైర్మన్‌ బొల్లెద్దు చిన్నా తదితరులు ఆమెను పరామర్శించారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళనైన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. టీడీపీ నేతల తీరు అమానుషమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top