
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్‌క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్‌రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్‌క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.
అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.