గుండె ఆగకముందే ఫ్రీజర్‌లో.. వృద్ధుడు మృతి

Tamil Nadu Old Man Deceased Being Locked Alive in Corpse Freezer - Sakshi

ఫ్రీజర్‌లో పెట్టిన ఆ వృద్ధుడు మరణించాడు

చెన్నై: బతికి ఉండగానే ఇరవై నాలుగు గంటల పాటు ఫ్రీజర్‌లో గడపాల్సిన దుస్థితిని ఎదుర్కొన్న తమిళనాడు వృద్ధుడు మరణించాడు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన, మృతి చెందినట్లు వైద్యులు శుక్రవారం ధ్రువీకరించారు. వివరాలు.. సేలం కందపట్టి హౌసింగ్‌ బోర్డుకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి  బాలసుబ్రమణ్య కుమార్‌ (70)కు పిల్లలు లేరు. గత ఏడాది ఆయన భార్య కూడా మరణించడంతో, తన సోదరుడు శరవణన్, ఇతర బంధువులతో కలిసి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో, కొన్ని రోజుల క్రితం బాలసుబ్రమణ్య కుమార్‌ అనారోగ్యం బారిన పడటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో, ఆయన బతికే పరిస్థితి లేదని వైద్యులు తేల్చారు. (చదవండి: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మరోసారి కన్నీళ్లే )

దీంతో మంగళవారం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్‌  చలనం లేకుండా పడిపోవడంతో, తన అన్నయ్య మరణించినట్టేనని భావించిన శరవణన్, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో భాగంగా ఫ్రీజర్‌ బాక్స్‌ను ఇంటికి తెప్పించి, బాలసుబ్రమణ్య కుమార్‌ కాళ్లు, చేతుల కట్టి మృతదేహంలా చుట్టి అందులో పడుకోబెట్టాడు. అయితే ఆయన శరీరం చచ్చుబడ్డా, హృదయ స్పందన తెలుస్తుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందా అని రాత్రంతా ఎదురు చూశాడు. (చదవండిబతికే ఉన్న అన్నను ఫ్రీజర్‌లో పెట్టాడు...! )

ఈ క్రమంలో, బుధవారం ఉదయాన్నే ఫ్రీజర్‌ బాక్స్‌ అద్దెకు ఇచ్చిన వ్యక్తి, శరవణన్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో, బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరంలో చలనం కనిపించడంతో, కళ్లు తెరచుకుని ఊపిరీ పీల్చలేని స్థితిలో ఉండటాన్ని గమనించి ఆందోళన చెందాడు. ఈ విషయం గురించి శరవణన్‌ను హెచ్చరించినప్పటికీ, ఆయన పట్టించుకోక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీసి, అంబులెన్స్‌లో  ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నేడు మృతిచెందారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top