Bengaluru Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి

Tamil Nadu MLA Son Among 7 Succumbs in Car Crush In Bengaluru - Sakshi

అదుపుతప్పిన ఆడి కారు

ఎమ్మెల్యే తనయుడు సహా ఏడుగురు మృతి

బెంగళూరు కోరమంగళలో దుర్ఘటన

మృతుల్లో కాబోయే దంపతులు

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అర్ధరాత్రి ఆడి కారు రోడ్డు ప్రమాదం ఏడుమంది జీవితాలను కబళించగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతీ యువకులకు అదే చిట్టచివరి జాలీ రైడ్‌ అయ్యింది. సోమవారం అర్ధరాత్రి అనంతరం 1:35 గంటల సమయంలో కోరమంగళ మంగళ కళ్యాణమంటం వద్ద ఖరీదైన ఆడి కారు వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్‌పై కరెంటు పోల్‌ను ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోయారు.

కారు నడుపుతున్న కరుణాసాగర్‌ (28), ఆయనకు కాబోయే భార్య బిందు (24), వారి స్నేహితులు ఇషికా (21), డాక్టర్‌ ధనూషా (21), అక్షయ్‌ గోయల్, ఉత్సవ్, రోహిత్‌ (23) దుర్మరణం చెందారు. కరుణాసాగర్‌ హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై.ప్రకాష్‌ ఏకైక తనయుడు.
చదవండి: నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా..

 సీటు బెల్టులు పెట్టుకోలేదు .. బెలూన్లు తెరుచుకోలేదు  
ఆ సమయంలో ఎవరూ సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడంతో పాటు కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడంతో మృత్యువు కబళించినట్లు అంచనా. ఏ కారో కూడా గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అతివేగంతో డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదానికి కారణమని నగర ట్రాఫిక్‌ విభాగ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రవికాంతేగౌడ తెలిపారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.

కారులో 5 మంది కూర్చోవచ్చు, కానీ 7 మంది ఉన్నారు. ఎవరూ కూడా సీట్‌బెల్డ్‌ పెట్టుకోలేదు. సీట్‌బెల్ట్‌ ధరించినట్లతే బతికేవారు. ఆరుమంది ఘటనాస్థలంలోనే మృతిచెందగా ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఇద్దరు తమిళనాడు, ఒకరు కేరళ, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. ఐదుమంది బెంగళూరులో పీజీ హాస్టళ్లలో ఉంటున్నారు. వీరు ఏయే ఉద్యోగాలు చేస్తున్నారనేది విచారిస్తున్నారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించారా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుంది అని వివరించారు.  

ప్రాణస్నేహితులు  
మృతుల్లో ఐదుగురు కరుణాసాగర్‌కు ప్రాణస్నేహితు­లు. ధనూషా దంతవైద్యురాలు, ఇషికా ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి, హుబ్లీకి చెందిన రోహిత్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం బెంగళూరులో పీజీలో ఉంటున్నాడు. హర్యానా, కేరళకు చెందిన గోయల్, ఉత్సవ్‌లు కూడా కోరమంగళలో పీజీలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఐదుమంది కలిసివెళ్లేవారు. మృతదేహాలను సెయింట్‌జాన్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే, బంధుమిత్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. 

వేగంగా డ్రైవింగ్‌  
సోమవారం రాత్రి 10.35 సమయంలో కరుణాసాగర్‌ అతివేగంగా కారుడ్రైవింగ్‌ చేస్తూ వెళ్లాడు. కోరమంగల అపోలో ఆసుపత్రి వద్ద చెక్‌పోస్టులో కారును పోలీసులు ఆపి ఎందుకు వేగంగా వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇంటికి వెళుతున్నామని కరుణాసాగర్‌ తెలిపాడు. నైట్‌ కర్ఫ్యూ ఉంది, నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆ తరువాత అర్ధరాత్రి పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తూ అత్యంత వేగంగా డ్రైవింగ్‌ చేసినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న ఒక సీసీ కెమెరాలో ప్రమాదం పాక్షికంగా రికార్డయింది.   

ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే  
కారు ఢీకొట్టిన వేగానికి వెనుక మధ్యలో కూర్చున్న యువతి ఎగిరివచ్చి ముందు అద్దంలో చిక్కుకుందని ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఓ క్యాబ్‌ డ్రైవరు సతీష్‌ కారు పార్కింగ్‌ చేసి రూమ్‌లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 1.35 సమయంలో గట్టిగా శబ్దం వినపడింది. లేచి చూడగా కారులో దట్టమైన పొగ ఆవరించింది. ఆ రోడ్డులో వస్తున్న కొందరు వాహనాలను నిలిపి కారులో ఉన్న వారిని రక్షించడానికి యత్నించారు. కారు ముందుభాగం తునాతునకలు కాగా, డోర్లు లాక్‌ అయ్యాయి. 20 నిమిషాలు ప్రయత్నించి డోర్లు తీశారు. ఓ యువకుడు దగ్గుతుండగా మిగిలినవారు దాదాపు చనిపోయి ఉన్నారు. ఓ యువతి తల ముందు అద్దంలో ఇరుక్కుంది. కారు సీట్లు రక్తసిక్తమైయ్యాయి, కారులోపల ఏడుమంది చిక్కుకుని కాళ్లు, చేతులు విరిగిపోవడంతో సీట్లు రక్తమయం కాబడ్డాయి.  ప్రమాద స్థలంలో రక్తం ధారలు కట్టింది. సతీశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆడుగోడి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top