కోదండ రాముని విగ్రహం ధ్వంసం

Sri Rama Idol Beheaded In Ramatheertham In Vizianagaram - Sakshi

సాక్షి, నెల్లిమర్ల రూరల్‌: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. (చదవండి: వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్‌ జలాల్లోకి)

సమాచారం తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. పేదలకు  ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొంతమంది కావాలనే ఈ ఘటనకు పాల్ఫడ్డారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని రాజకీయ ఉన్మాదులు, అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top