వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్‌ జలాల్లోకి

Fishermen Misguided To Enter The Bangladesh Sea Border In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం/పూసపాటిరేగ: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వేటకు వెళ్లిన తమవారు బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ బందీలయ్యారనే వార్త విని ఇక్కడి వారి కుటుంబాలు తల్లడిల్లాయి. గత అనుభవాల దృష్ట్యా తమ వారు ఎప్పుడొస్తారో తెలి యక వారంతా అల్లాడిపోయా రు. కనీసం తమ వారితో అధికారులు ఫోన్‌లో మాట్లాడించినా... బాగుండని బోరున విలపించారు. కానీ అదృష్టవశాత్తూ వా రు సురక్షితంగానే ఉన్నారని తెలియగానే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ దేశ కోస్టుగార్డులు  వెనక్కిపంపించారన్న సమాచారంతో తిప్పలవలస, పతివాడ బర్రిపేట, చింతపల్లి గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచం మొత్తానికి కీడు చేస్తున్న కరోనా వీరికి మాత్రం ఒకరకంగా మేలు చేసిందనే చెప్పాలి.

బందీలుగా చిక్కింది ఇలా... 
పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పతివాడబర్రిపేట, చింతపల్లికి చెందిన ఎడుగురు మత్స్యకారులు మరో ఐదు గురు మత్స్యకారులతో కలిసి విశాఖ హార్బర్‌ నుంచి నవంబర్‌ 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.  నిబంధనలపై అవగాహన లేక మన దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. నవంబర్‌ 29 తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంగ్లాదేశ్‌ రక్షక దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క దానయ్య, రాయితి లక్ష్మయ్య, నక్క బోడోడు, పతివాడబర్రిపేటకు చెందిన గరికిన ఎల్లయ్య, గరికిన శ్రీను, మైలపల్లి కొర్లయ్య, చింతపల్లికి చెందిన చొక్కా శ్రీను ఉన్నారు. బోటులో మత్స్యకారుల పక్కనే మన దేశ సముద్ర జలాల్లో వేట చేస్తున్న మత్స్యకారుల ద్వారా బోటు యజమాని వాసుపల్లి ప్రసాదుకు అక్కడి నుంచి సమాచారం పంపించారు.

సోమవారం ఉదయానికి మత్స్యకారుల స్వగ్రామాలకు విషయం తెలియచేయడంతో వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అదృష్ట వశాత్తూ గంటల వ్యవధిలోనే మత్స్యకారులను కరోనా భయంతో బంగ్లాదేశ్‌లో విడిచిపెట్టారు. జీపీఆర్‌ఎస్, వలలు తీసుకొని సరిహద్దు లు ఎందుకు దాటారని బంగ్లాదేశ్‌ కోస్టుగార్డులు  ఆ గ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. మత్స్య కారులు సురక్షితంగా వస్తున్నారని మ త్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు నిర్మలా కుమారి ధ్రు వీకరించారు. 

చిక్కితే జైలుకే 
పొట్టకూటి కోసం వలస పోతున్న మత్స్యకారులు సముద్రంలో దారి తెలీక పొరపాటున పరాయి దేశ జలాల్లోకి వెళ్లి అక్కడి రక్షఖ దళాలకు బందీలుగా చి క్కుతున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలకు చెందిన వేలాది మంది కడలి బిడ్డలు విశాఖపట్నం, కర్ణాటక పోర్టులకు వెళ్లి, అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళుతుంటారు. దారి తప్పి విదేశీలకు బందీలు గా మారి ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతున్నారు. 2018 నవంబర్‌ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించారంటూ అక్కడి అధికారులు ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు.

దాదాపు 13 నెలల తర్వాత వీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఆ తరువాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి అనేక వరాలనిచ్చా రు. వేట విరామ సయంలో ఇచ్చే సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. డీజిల్‌ రాయితీలను కూడా పెంచారు. అయితే ఈసారి చిక్కిన వారిని ఒకరకంగా కరోనా కాపాడిందంటున్నారు.  

ఇక రాడేమోనని భయపడ్డాం 
నా కొడుకు నక్కా దానయ్య బందీగా చిక్కాడని కబురు తెలియగానే గుండెలు గుభేల్‌ మన్నాయి. ఎందుకంటే గతంలో బందీలుగా చిక్కిన మా బంధువులు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయారు. మా బాబు పరిస్థితీ అంతేనా అని భయపడ్డాం. ఇంతలోనే అక్కడివాళ్లు విడిచిపెట్టారని సమాచారం వచ్చింది. దేవుడే మావోడ్ని కాపాడాడు. – నక్కా లక్ష్మీ, నక్కా దానయ్యతల్లి, తిప్పలవలస. 

ఆశలు వదులుకున్నాను... 
నా కొడుకు నక్క బోడోడు బంగ్లాదేశ్‌ మత్స్యకారులకు చిక్కా డని తెలియగానే నాకు దిక్కు ఎవరని బోరున ఏడ్చాను. దాదాపుగా ఆశలొదిలేసుకున్నాను. అంతలోనే అక్కడి అధికారులు మావోల్ని ఒదిలీసేరని తెలిసింది. నిజంగా దేవుడు మాపక్కనున్నాడు. అందుకు మావోడు వచ్చేత్తన్నాడు. వాడిని తనివితీరా సూసుకోవాలనుంది.  – నక్క అప్పన్న, నక్క బోడోడు తండ్రి తిప్పలవలస  

మా అల్లుడికి మరో జన్మే 
మా అల్లుడు రాయితి లక్ష్మయ్య బంగ్లాదేశ్‌ కోస్టుగార్డులకు చిక్కి రోజు వ్యవధిలోనే తిరిగి ఇక్కడికి బయలుదేరినట్లు తెలిసింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. బంగ్లాదేశ్‌ అధికారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించడంతో తిరిగి స్వగ్రామాలుకు పంపించారు. – మైలపల్లి అప్పయ్యమ్మ, రాయితి లక్ష్మయ్య అత్త, తిప్పలవలస. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top