మామను నరికిచంపిన అల్లుడు 

Son In Law Assassination Uncle In Krishna District - Sakshi

ఒక్క రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

మైలవరం(కృష్టా జిల్లా): మామను హత్య చేసి, భార్య, అత్త, మరదలిపై హత్యాయత్నం చేసిన నిందితుడు వీర్ల రాంబాబును అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు. మైలవరం పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ వీర్ల రాంబాబు నాలుగేళ్ల క్రితం మైలవరం మండలం వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు రెండో కుమార్తె ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కట్నంగా రూ.2.50లక్షలు నగదు, కుంట మామిడి తోట, ఒక కాసు బంగారపు ఉంగరం ఇచ్చారు.

ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. నిందితుడు రాంబాబు తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు బానిసై తరచూ కట్నంగా ఇచ్చిన మామిడి తోట అమ్మి డబ్బు తేవాలని, లేకుంటే చంపి వేరే పెళ్లి చేసుకుంటానని తన  భార్యను పలుసార్లు తీవ్రంగా కొట్టాడు. పిల్లల కోసం భార్య ధనలక్ష్మి మామిడి తోట అమ్మేందుకు వ్యతిరేకించింది. రెండు రోజుల క్రితం నిందితుడు తన భార్యను తీవ్రంగా కొట్టి పొలం అమ్మకపోతే అందర్నీ చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెదురుబీడెం వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెద్దలతో మాట్లాడి సెటిల్‌ చేద్దామన్నారు.

అందరూ నిద్రపోతున్న సమయంలో.. 
సోమవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత నిందితుడు గొట్టం కత్తితో మామ కొండలరావును విచక్షణా రహితంగా నరకడంతో అతను మృతి చెందాడు. అనంతరం భార్య, అత్త, మరదలిపై కూడా దాడి చేయడంతో వారు గాయాలపాలయ్యారు. భయంతో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడం గమనించి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలందించారు.

వెదురుబీడెంలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌  ఆరా తీసి,  మైలవరం సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు మంగళవారం నిందితుడిని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని పోలవరం కాలువ వద్ద అరెస్టు చేశారు. నిందితుని  నుంచి గొట్టం కత్తి, రక్తం అంటిన దుస్తులు సేకరించినట్లు తెలిపారు. నిందితుని అరెస్టు చేసిన సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top