మొబైల్‌ ఇవ్వనందుకు దాడి.. కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు

Rowdy Sheeter Sameer Attacks persons In Habibnagar - Sakshi

హబీబ్‌నగర్‌లో అర్థరాత్రి రౌడీషీటర్‌ హల్‌చల్‌ 

దాడిలో గాయపడ్డవారంతా ఒకే కుటుంబం వారే

పరారీలో రౌడీషీటర్లు.. 

పోలీసుల అదుపులో ఇద్దరు అనుచరులు

సాక్షి, నాంపల్లి: హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్‌ హల్‌చల్‌ చేశాడు. రౌడీషీటర్‌తో పాటు మరో పది మంది అనుచరులు కత్తులు, కట్టెలు, నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు. దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుభాన్‌పుర ప్రాంతానికి చెందిన సమీర్‌ అనే రౌడీషీటర్‌ తన అనుచరుడిని ఏక్‌మినార్‌ మసీదు సమీపంలో ఉండే ఓ మొబైల్‌ షాపుకి పంపించారు. తన పేరును చెప్పి మొబైల్‌ తీసుకురమ్మని ఆదేశించారు. మొబైల్‌ షాపు యజమాని మహ్మద్‌ ఆసిఫ్‌ నిరాకరించడంతో ఆగ్రహించిన రౌడీషీటర్‌ అర్థరాత్రి తన అనుచరులతో దర్గా షాఖామూస్‌లో నివాసం ఉండే మహ్మద్‌ ఆసిఫ్‌ ఇంటికి చేరువలో కాపుకాశారు. ఆదివారం రాత్రి మొబైల్‌ షాపు మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో రౌడీషీటర్, అతని అనుచరులు మహ్మద్‌ ఆసిఫ్‌ను అడ్డగించి నిక్కల్స్‌తో పంచ్‌లు కొట్టారు.

దాడిని ఆపటానికి వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారి ఇద్దరు అనుచరులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్‌ సమీర్‌ పారిపోయాడు. దాడిలో సమీర్‌తో పాటు మరో రౌడీషీటర్‌ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పారిపోయిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో రౌడీషీటర్‌ సమీర్‌ పీడీ యాక్టులో జైలుకు వెళ్లి వచ్చారు.  దాడిలో మహ్మద్‌ ఆసిఫ్‌తో పాటుగా అంజద్‌ఖాన్, బాబు, వీరి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top