
జయపురం: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ దగ్గర సిందిగుడ సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ పికప్ వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా, మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జగదల్‌పూర్ వాసులు కాగా వీరందరూ సిందిగుడలోని పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురైన ట్లు సమాచారం.
బండి అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యసేవల నిమిత్తం జగదల్‌పూర్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు.