గన్‌తో బెదిరించి.. దోపిడీకి యత్నం

Rajole:Two Men On A Bike Try To Rob In Gold Shop With Gun - Sakshi

సాక్షి, రాజోలు: టిప్‌టాప్‌గా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాజోలులోని ఓ జ్యూయలరీ షాపులో గన్‌తో బెదిరించి బంగారు ఆభరణాల దోపిడీకి ప్రయత్నించడం కలకలం రేపింది. షాపు యజమాని తణుకు సోమ సంతోష్‌ వాసుదేవ్‌ ప్రతిఘటించడంతో దొంగలు పరారయ్యారు. ఎస్సై కృష్ణమాచారి కథనం ప్రకారం.. రాజోలు జెడ్‌ టర్నింగ్‌లో ఉన్న లక్ష్మీశ్రీనివాస జ్యూయలరీ షాపునకు సోమవారం మధ్యాహ్నం భోజన సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. నెక్లెస్‌ కావాలని యజమానిని అడిగారు. బంగారు ఆభరణాలు చూపిస్తుండగా బేరమాడుతున్నట్టు నటించారు. ఒక్కసారిగా వారిలో ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న గన్‌ చూపించి బెదిరించాడు.

నగల దోపిడీకి ప్రయతి్నస్తుండగా యజమాని వాసుదేవ్‌ ప్రతిఘటించాడు. గన్‌ చూపించిన వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పెనుగులాటలో దొంగలు వాసుదేవ్‌ను ఒక్కసారిగా వెనుకకు నెట్టి పరారయ్యారు. అదే సమయంలో చోరీకి ప్రయత్నించిన ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను వాసుదేవ్‌ లాక్కున్నాడు. ఈ ఘటనపై రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కృష్ణమాచారి జ్యూయలరీ షాపు వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆభరణాలు చోరీ అవలేదని, గన్‌తో బెదిరించిన దుండగులను సీపీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయతి్నస్తున్నామని ఎస్సై తెలిపారు.
చదవండి: లగ్జరీ కారు.. సినిమాటిక్‌గా కొట్టేశారా? 
ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. 

ప్లాన్‌ ఆమెది.. అమలు వారిది..
రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలోని పలు ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించడంతో పాటు మోటార్‌ సైకిళ్లను కూడా అపహరించిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారు, 8 మోటార్‌ సైకిళ్లు స్వాదీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ ఏటీవీ రవికు మార్‌ ఈ వివరాలు వెల్లడించారు. శాటిలైట్‌ సిటీ ఏటీఎంలో చోరీ జరిగినట్టు ఈ నెల 3న సమాచారం వచ్చింది. బొమ్మూరు సీఐ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై శుభశేఖర్‌ దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులపై ఒక అంచనాకు వచ్చారు. సోమవారం ఉదయం 5 గంటలకు హుకుంపేట డీమార్ట్‌ వద్ద బైక్‌పై ఇద్దరు, కారులో యువతితో పాటు నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిలుకూరుకు చెందిన బొక్కా మణికంఠ రొయ్యల చెరువులు వేసి నష్టపోయాడు. దీంతో స్నేహితులైన కొంతమూరుకు చెందిన బొల్లం యోగనందినీదేవి ఎలియాస్‌ నందిని, పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాలకు చెందిన నాగరాజు కార్తీ క్‌ సుదర్శన్‌వర్మ, మహాదేవపట్టానానికి చెందిన బొక్కా రాజేష్, ఏలూరుకు చెందిన బొల్లా బాలసుబ్రహ్మణ్యం, వంగారపు సురేష్‌, షేక్‌నాగూర్‌తో ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టారు. యోగనందినీదేవి ఏటీఎంల చోరీకి పథకం వేస్తే మిగిలిన ఆరుగురు అమలు చేసే వారు. శాటిలైట్‌ సిటీ, తాపేశ్వరం, రావులపాలెం, జగ్గంపేట, రాజానగరం, గాడాల, సూరంపాలెం, రాజమహేంద్రవరం పరిసరాల్లోని పలు ఏటీఎంలలో వారు చోరీలకు ప్రయత్నించారు. రావులపాలెం ఏటీఎంతో మాత్రమే రూ.32,200 నగదు వచ్చింది. ఈ ముఠా సభ్యులు మోటారు సైకిళ్ల చోరీలకు కూడా పాల్పడ్డారు. యోగనందినీదేవిపై కాకినాడ పరిధిలో కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై శుభశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top