వివాహేతర సంబంధం: భార్య సహకారంతో తోడల్లుడి దారుణం.. 225 రోజులకు దొరికిన అస్తిపంజరం

Ragya Niak Murder Case: Found Skeleton After 225 Days Krishna River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు 19న రాగ్యానాయక్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, బతికుండగానే కాళ్లు చేతులు కట్టేసి కృష్ణా నది బ్యాక్‌ వాటర్‌లో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసును చేధించిన రాయదుర్గం పోలీసులు అప్పట్లో మృతదేహం కోసం ముమ్మరంగా గాలించినా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. కృష్ణానదిలో బ్యాక్‌ వాటర్‌ తగ్గడంతో 225 రోజుల తర్వాత చేపల వలలో చుట్టి ఉన్న అస్థి పంజరాన్ని గుర్తించిన తుంగపాడు, లావు తండా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం రాయదుర్గం పోలీసులు అక్కడికి వెళ్లి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, తుంగపాడు గ్రామానికి చెందిన రాగ్యానాయక్‌(28), పెద్దవూరకు చెందిన రోజాతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాగ్యానాయక్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండలో నివాసం ఉండేవారు..  ఇబ్రహీంపట్నం మండలం, గున్‌గల్‌ సమీపంలోని ఎల్లమ్మతండాకు చెందిన అతడి తోడల్లుడు లక్‌పతితో రోజా వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఈ క్రమంలో లక్‌పతి రాగ్యానాయక్‌ను  చంపుతానని  బెదిరించినట్లు అతని బంధువులు అప్పట్లో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా లావుతండాలో రాగ్యానాయక్‌ స్థలాన్ని కొనుగోలు చేసిన లక్‌పతి అతడికి రూ. 3 లక్షలు బాకీ ఉన్నాడు. గత ఆగస్టు 19న బొంగులూర్‌ గేట్‌ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని రాగ్యానాయక్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు. దేవరకొండలో డబ్బులు రావాల్సి ఉందని చెప్పి కారులో వెంట తీసుకెళ్లారు. లక్‌పతితో పాటు అతని స్నేహితులు మన్‌సింగ్, బాలాజీ, శివ తదితరులు రాగ్యానాయక్‌కు మద్యం తాగించి నేరుడుగొమ్మ మండలం, బుగ్గతండా వద్ద కాళ్లు చేతులు కట్టి, శరీరానికి ఐరన్‌ రాడ్లు కట్టి, చేపల వలలో చుట్టి, పడవలో తీసుకెళ్లి కృష్ణా నది మధ్యలో పడేశారు.

తన భర్త నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని, ఫోన్‌ పని చేయడం లేదని ఆగస్టు 23న అతడి భార్య రోజా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోజా ప్రవర్తనపై అనుమానంతో విచారణ చేపట్టగా లక్‌పతితో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రాగ్యానాయక్‌ను హత్య చేసినట్లు లక్‌పతి అంగీకరించడంతో నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న అస్థిపంజరానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇందులో కొన్ని ఎముకలను డీఎన్‌ఏ టెస్టుకు పంపనున్నట్లు  ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ తెలిపారు. రాగ్యానాయక్‌ హత్య కేసులో అస్తి పంజరం కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top