‘మేడారం గోవిందరాజుల’ పూజారి హత్య

Priest killed in Medaram - Sakshi

బండరాళ్లతో కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గోవిందరాజుల గద్దె వద్ద పూజారిగా వ్యవహరిస్తున్న గబ్బగట్ల రవి(45)ని సోమవారంరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన దబ్బగట్ల రవి అత్తగారి గ్రామమైన మేడారంలో స్థిరపడ్డారు. వీరిది గోవిందరాజుల గద్దె పూజారుల కుటుంబం.

ఈ కుటుంబీకులు వారానికి ఒకరు చొప్పున గద్దె వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. తనవంతు వారంలో రవి భక్తులకు బొట్టు పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రవి హత్య జరగడం మేడారంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావులు మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా వివరాలు సేకరించారు.  

బైక్‌పై తిరిగిన వారే హత్య చేశారా? 
గోవిందరాజుల పూజారి రవి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తు లు రవిని బైక్‌పై ఎక్కించుకుని సోమవారం మేడారంలో తిరిగారని, మద్యం కూడా సేవించారని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉందని అంటున్నారు. తమ పర్సు పోయిందని, దానిని వెతుకుదామంటూ రవిని బైక్‌పై తీసుకెళ్లారని, ఆ పర్సు విషయమై స్థానికంగా పలువురిని వాకబు కూ డా చేశారని చెబుతున్నారు.

ఈ క్రమంలో మేడారం రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డు వద్ద రాత్రి వంట కూడా చేసుకున్నారని, మద్యం తాగించిన అనంతరం రవి తలపై బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని, ఆయన చెప్పులు ఘటనాస్థలానికి దూరంగా పడి ఉండటంతో అంతకుముందు పెనుగులాట కూడా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పూజారి రవికి ఇంతకుముందే పరిచయముందా అనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సోమవారం రాత్రి స్థానికంగా కరెంట్‌ సరఫరా లేదని, ఇదే అదనుగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో క్వార్టర్‌ మందు సీసా, పచ్చడి ప్యాకెట్‌ పడి ఉన్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top