తాగొద్దని మందలిస్తే.. చాకులతో పొడిచి, ఇనుపరాడ్డులతో కొట్టి, ఆపై గుర్తు పట్టకుండా

Priest Deceased Case: Police Arrest Three Friends Of Naga Sai - Sakshi

పురోహితుడి నాగసాయి హత్యకేసులో ముగ్గురి అరెస్ట్‌ 

విలేకరుల సమావేశంలో తూర్పు మండల డీఎస్పీ రవికుమార్‌ 

రాజమహేంద్రవరం: రోజూ స్నేహితులతో కలిసి తాగి తిరుగుతుండడంతో తరుచూ మందలిస్తూ కట్టడి చేస్తున్నాడనే ఉద్దేశంతో పురోహితుడు కంచిభట్ల నాగసాయి (25)ను తోటి స్నేహితుడు, మరో ఇద్దరితో కలిసి హత్యచేశారని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా తూర్పుమండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ తెలిపారు. హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సోమవారం తూర్పుమండల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కంచిభట్ల నాగసాయి, వెలివెంటి సాయిపవన్‌ నాలుగు నెలలుగా కొంతమూరులోని బొమ్మనకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి కుల వృత్తి అయిన పౌరోహిత్యం చేస్తుండేవారు.

చదవండి: విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి..

సాయిపవన్, కొంతమూరు బొమ్మనకాలనీకి చెందిన నెరుగొందల నాగేంద్ర, ఒక మైనర్‌బాలుడితో కలిసి ప్రతిరోజు తాగి తిరుగుతుండేవాడు. దీంతో కంచిభట్ల నాగసాయి వారిని తరుచూ మందలించేవాడు. ఇది నచ్చక సాయిపవన్, మైనర్‌ బాలుడితో కలిసి గత నెల 24వ తేదీన అర్ధరాత్రి వారి రూమ్‌లోనే చాకులతో పొడిచి, ఇనుపరాడ్డులతో కొట్టి హత్యచేశారు.

అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా నెరుగొందల నాగేంద్రతో కలిసి పెట్రోల్‌తో కాల్చేశారు. మళ్లీ ఈ నెల మూడో తేదీన పెట్రోలు పోసి కాల్చుతుండగా వాసన వచ్చి చుట్టుపక్కల వారు రావడంతో ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఈ నెల 3వతేదీ రాత్రి 8 గంటల సమయంలో కొంతమూరులోని బొమ్మలకాలనీలో హోప్‌చర్చి దగ్గరలో ఒక ఇంట్లో మృతుడు శవం కాలిపోయి ఉందని వీఆర్‌వో మిర్తివాడ రామాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి, అక్కడే శవపంచనామా నిర్వహించారు. అనంతరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్యారస్తోగి ఉత్తర్వుల మేరకు అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి పర్యవేక్షణలో తూర్పుమండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ సారథ్యంలో రాజానగరం పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంవీ సుభాష్‌, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 36గంటల్లోనే కేసును ఛేదించి ఆదివారం కొంతమూరులో వెలివెంటి సాయిపవన్, నెరుగొందల నాగేంద్ర, మైనర్‌బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును 36 గంటల్లో ఛేదించిన రాజానగరం పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంవీ సుభాష్‌, ఎస్సైలు వై.సుధాకర్, ఎండీ జుబేర్, ఏఎస్సై వై.శ్రీనివాస్, హెచ్‌సీ, పీసీలను ఎస్పీ ఐశ్వర్యారస్తోగి అభినందించారని డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top