దారుణం: అదృశ్యమైన మహిళ.. మృతదేహంగా | Sakshi
Sakshi News home page

దారుణం: అదృశ్యమైన మహిళ.. మృతదేహంగా

Published Tue, Oct 6 2020 10:43 AM

Pregnant Lady Mysterious Deceased In Adilabad District - Sakshi

సాక్షి, చెన్నూర్‌: చెన్నూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి అదృశ్యమైన బాలింత.. మృతదేహంగా(చెట్టుకు ఉరేసుకొని) మారి లభ్యమైంది. సదరు మహిళ పట్టణ సమీపంలోని ముళ్లపొదల్లో అస్థిపంజరంగా లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేసి ముళ్లపొదల్లో ఉరి వేశారా అనే అనుమానాలు లెవనెత్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లా దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన దాదా మానస(36)కు చెన్నూర్‌ మండలం నాగాపూర్‌ గ్రామానికి చెందిన రమేశ్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. గత నెల 13 చెన్నూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కాని అదే నెల 17న ఆసుపత్రి నుంచి అదృశ్యమైంది.

మానస భర్త రమేశ్‌ ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం పట్టణ సమీపంలో లంబాడిపల్లి గ్రామస్తులు రహదారి పక్కన ముళ్లపొదల్లో అస్థిపంజరం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈమేరకు ట్రెయినీ ఏసీపీ అశోక్‌కుమార్, చెన్నూర్‌ సీఐ ప్రమోద్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం పరిశీలించారు. మహిళ చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఆనవాళ్లతోపాటు ఆమె చున్నీ, చెవి రింగు, వెంట్రుకల ఆధారంగా మృతదేహం మానసదిగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటన స్థలంలోనే వైద్యులు సత్యనారాయణ పోస్టుమార్టం నిర్వహించారు. ఆనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. 

పసిబిడ్డ ఏం పాపం చేసింది.. 
వివాహమైన 15 ఏళ్లకు సంతానం కలిగితే మానస(తల్లి) పురిట్లోనే బిడ్డను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాలి్సన తల్లి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పసి బిడ్డ ఏం పాపం చేసిందని.. వెళ్లిపోయావు మానస.. అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement