Film Nagar: కోటి విలువైన బంగారం, వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్‌ విలువ తెలియక..

Police Solved Diamonds Gold Worth Of 1 Crore Robbery At Film Nagar HYD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫిలింనగర్‌లో ఈ నెల 20న రాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని బంజారాహిల్స్‌ డివిజన్‌ క్రైం పోలీసులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. చింతలబస్తీకి చెందిన చాపల అంజలప్ప అలియాస్‌ మచ్చ అలియాస్‌ అంజి స్థానిక చేపల మార్కెట్లో పని చేసేవాడు. బంజారాహిల్స్‌లోని సింగాడికుంటకు చెందిన మైలారం పవన్‌కుమార్‌తో స్నేహం, జల్సాలకు దారి తీసింది. గంజాయితోపాటు మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నారు. ఇందులో భాగంగా దొంగతనానికి స్కెచ్‌ వేసిన వీరు.. ఈ నెల 20న రాత్రి నంబర్‌ ప్లేటు లేని స్కూటీపై వీధుల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతుండగా ఓ ఇంటి తాళాలు వేసి ఉండటం కనిపించింది.

ఇద్దరు ఆ ఇంటి వెనుక కిటికీలో నుంచి లోపలికి దూరి నగదు, నగల కోసం యత్నిస్తుండగా ఓ లాకర్‌ కనిపించింది. లాకర్‌ తీసుకుని బంజారాహిల్స్‌ రోడ్‌నంబరు 13లోని ఓ స్మశాన వాటికలో పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు, వజ్రాలను పంచుకున్నారు. దొంగతనం జరిగిన రెండు రోజుల తర్వాత పవన్‌కుమార్‌ పోలీసులకు చిక్కాడు. అదే రోజు అంజిని పట్టుకోవడానికి యత్నించగా పోలీసుల కదలికలను గుర్తించిన అతను తన వద్ద ఉన్న ఆభరణాలు మణప్పురంలో తాకట్టు పెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు.

లక్డీకాపూల్‌లో బస్సు ఎక్కి బెంగుళూరులో దిగి అక్కడి నుంచి గోవాకు చెక్కేశాడు. పవన్‌కుమార్‌ను విచారించగా పోలీసులకు ఎంతకూ సహరించలేదు. అయితే పవన్‌ చేతి మీద ఓ ఫోన్‌ నంబరు రాసి ఉండటాన్ని గుర్తించిన క్రైం పోలీసులు ఆ నంబరు ఎవరిదని ఆరా తీశారు. స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబరుపై నిఘా పెట్టగా అది అంజలప్ప అనే పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆ నంబరును ఆధారంగా చేసుకొని చోరీ జరిగిన రాత్రి టవర్‌ డంప్‌ పరిశీలించగా అక్కడే రెండు గంటల పాటు తిరిగినట్లు గుర్తించారు.
చదవండి: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్‌

దీంతో ప్రధాన నిందితుడు అంజికి సంబంధించిన నంబరును గుర్తించి లోకేషన్‌ పెట్టగా గోవాలో ఉన్నట్లు తేలింది. వెంటనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులు గోవాకు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్న అంజిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తుండగానే గోవాలో చిక్కాడు. పోలీసులను తక్కువ అంచనా వేసి ఇక తాను దొరకనని గోవాలో మకాం వేసిన అంజిని సాంకేతికతతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశారు.  

నల్లమోతు పవన్‌ అనే ఆభరణాల వ్యాపారి ఫిలింనగర్‌లో శమంతక డైమండ్‌ షోరూంను నిర్వహిస్తుండగా అందులోనే ఈ దొంగతనం జరిగింది. ఈ షోరూంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ రోడ్లపైన సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల జాడ చిక్కలేదు. అయితే సింగాడికుంటలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల్లో ఒకరైన మైలారం పవన్‌ దొరకడం, అతన్ని విచారిస్తే ప్రధాన నిందితుడు పట్టుబడటం జరిగిపోయాయి. 

డైమండ్స్‌ విలువ తెలియక.. 
తాము దొంగతనం చేసిన డైమండ్స్‌ రూ.లక్షలు విలువ చేస్తాయనే విషయం తెలియక నిందితులు పవన్‌కుమార్, అంజి వాటిని తమ గదుల్లో డబ్బాలో వేసి ఓ మూలన పెట్టారు. వాటిని అమ్మితే రూ.లక్షలు వస్తాయనే విషయం తెలియకనే కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top