బ్యాంక్‌ ఉద్యోగి హత్య కేసు.. వీడిన చిక్కుముడి

Police Chase Brutal Murder Case Of Bank Employee In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): నగరంలోని కరెంటాఫీస్‌ సెంటర్‌లో బ్యాంక్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురైన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఫోన్‌ కోసం ఓ పాతనేరస్తుడు తన సహచరుడితో కలిసి హత్య చేసిన విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో పోలీసులు నిందితులను శనివారం అరెస్ట్‌ చేశారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని విక్రమ్‌నగర్‌లో గల చాముండేశ్వరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మల్లిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (32) కెనరా బ్యాంక్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌లో పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ నాలుగున కార్యాలయ పని నిమిత్తం విజయవాడ వెళ్లిన ఆయన ఆరో తేదీ రాత్రి అక్కడి నుంచి నెల్లూరొచ్చారు. రాత్రి 11.45 గంటల సమయంలో కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద బస్సు దిగి వస్తుండగా, అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో కరెంటాఫీస్‌ సెంటర్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యారు. చదవండి: ఎవరూ లేనిది చూసి.. ఆరేళ్ల చిన్నారిపై

ఘటనపై కేసు నమోదు చేసిన వేదాయపాళెం పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నపాటి క్లూ సైతం దొరక్కపోవడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై లక్ష్మణ్‌రావు తమ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బైక్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య చేసింది పాత నేరస్తుడైన డైకస్‌రోడ్డు ఎన్‌సీసీ కాలనీకి చెందిన మొఘల్‌ అక్బర్, అతని స్నేహితుడు సయ్యద్‌ జావీద్‌గా గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు స్థానిక పెద్ద మనుషుల సాయంతో పోలీస్‌స్టేషన్లో శనివారం లొంగిపోయారు. చదవండి: పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని.. తాగిన మైకంలో! 

హత్య చేసింది ఇలా.. 
నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, హత్యచేసింది తామేనని అంగీకరించారు. పాత నేరస్తుడైన మొఘల్‌ అక్బర్‌పై పలు చోరీ కేసులు ఉన్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి అక్బర్‌ తన స్నేహితుడు జావీద్‌తో కలిసి చోరీ చేసేందుకు బయల్దేరారు. డైకస్‌రోడ్డు మీదుగా గాంధీనగర్‌ చేరుకోగా, అక్కడ దొంగతనానికి అనువుగా లేకపోవడంతో కరెంటాఫీస్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అదే సమయంలో రవీంద్రనాథ్‌రెడ్డి ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన నిందితులు ఫోన్‌ను చోరీ చేయాలని నిశ్చయించుకున్నారు. బైక్‌పై నిందితులిద్దరూ రవీంద్రనాథ్‌రెడ్డి వద్దకెళ్లి ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించగా, ఆయన ప్రతిఘటించారు. వారిని మందలించి పోలీసులకు పట్టిస్తానని చెప్పడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకు గురైన అక్బర్‌ తన జేబులో నుంచి కత్తిని తీసి రవీంద్రనాథ్‌రెడ్డి ఎడమై వైపు గొంతుకింద, ఛాతిపైన బలంగా పొడిచాడు. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి కుప్పకూలిపోయారు. అతని జేబు నుంచి కిందపడిన ఏటీఎం కార్డును నిందితులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని డీఎస్పీ వెల్లడించారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, ఎస్సై లక్ష్మణ్‌రావు, క్రైమ్‌ పార్టీ సిబ్బంది ప్రసాద్, సుధ, గోపాల్, జిలానీ, మస్తాన్‌ను డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top