పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త, అత్తమామలు

Police Arrested Husband In Connection With Suspicious Death Of His Mother And Daughter - Sakshi

మనోజ్ఞ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 

పట్నంబజారు (గుంటూరు): అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందిన నర్రా మనోజ్ఞ (29), ఆమె కుమార్తె తులసి (9 నెలలు) కేసులో భర్త కల్యాణ్‌ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్నారాయణలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి)

అత్తింటివారే తమ కుమార్తెను చంపారని మనోజ్ఞ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్, అక్కడ నివసించే కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. 
రెండు మృతదేహాలపై కనీసం రక్తం చుక్క కూడా లేకపోవడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 
శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం వరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంపై మనోజ్ఞ తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కరరావు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 
వివాహం అయిన నాటి నుంచి మనోజ్ఞను ఆమె తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై భర్త, అత్తమామలు దెప్పిపొడుస్తూ ఉండేవారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 
పుట్టింటికి కూడా వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేసేవారని మృతురాలి బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 
మనోజ్ఞ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తూ ఉండేదని, ఈ విషయంపై భర్త, అత్తమామలు వేధించేవారని పోలీసుల దృష్టికి వచ్చింది. 
ఇప్పటికే మనోజ్ఞ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న పలు ఆధారాలను సేకరిస్తున్నారు. 
మనోజ్ఞ, తులసిల మృతదేహాలకు ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top