అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి

Mother And Daughter Jumps From Apartment In Guntur - Sakshi

పట్నంబజారు(గుంటూరు): అనుమానాస్పద స్థితిలో తొమ్మిది నెలల చిన్నారి సహా తల్లి మృతి చెందిన ఘటనపై కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంకు చెందిన నర్రా కల్యాణ్‌చంద్రకు అదే జిల్లా పంగులూరు గ్రామానికి చెందిన మనోజ్ఞ(29)కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కల్యాణ్‌చంద్ర నేవీలో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలల తులసి అనే కుమార్తె ఉంది. అయితే హైదరాబాద్‌లో మనోజ్ఞ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కల్యాణ్‌ విధుల నిమిత్తం వెళ్లి కొద్ది నెలల తర్వాత వస్తుండేవాడు. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్‌ సమయం నుంచి గుంటూరు నగరంలోని లక్ష్మీపురం కమలేష్‌ అపార్ట్‌మెంట్స్‌లో కల్యాణ్‌ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారం, ఐదు సెంట్ల స్థలం, రూ.2 లక్షల నగదు, ఒక ఇల్లును కట్నంగా ఇచ్చారు.

అయినప్పటికీ మనోజ్ఞను భర్త కల్యాణ్‌ అతని తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ, కామేశ్వరి అనేక రకాలుగా హింసించేవారని, తమతో ఏ మాత్రం మీ కుటుంబం సరితూగదని నిత్యం వేధింపులకు గురిచేసేవారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట మృతురాలు ఇక్కడ ఉండలేకపోతున్నాని తల్లిదండ్రులు బాచిన రమేష్‌బాబు, విజయలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడి కన్నీరుమున్నీరయింది. ఆ సమయంలో మనోజ్ఞను తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులను వియ్యంకుడు శ్రీమన్నారాయణ సర్దిచెప్పి పంపించి వేశారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మనోజ్ఞ, ఆమె కుమార్తె తులసి అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందగా విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుంటూరుకు చేరుకున్నారు. తమ బిడ్డను భర్త, అత్తమామలే చంపేసి కింద పడేసి ఉంటారని మనోజ్ఞ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో ఇ.పూర్ణచంద్రరావు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top