‘మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి’

PIL Filed In TS HC on Addagudur Lockup Death Case - Sakshi

అడ్డగూడురు లాకప్‌డెత్‌ కేసుపై హైకోర్టులో పిల్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ పిల్‌ దాఖలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించారని పిటిషనర్ ఆరోపించారు. మరియమ్మ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

కాగా, అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య‌లపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 

అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి: హైకోర్టు
అడ్డగూడూరు లాకప్‌డెత్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించింది. ఈ కేసులో న్యాయ విచారణకు ఆదేశించింది. లాకప్‌డెత్‌పై విచారణ జరపాలని ఆలేరు మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రీపోస్ట్‌మార్టం జరపాలని హైకోర్టు సూచించింది. పీఎస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్‌?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top