Panipuri: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు

అనంతపురం సెంట్రల్: పానీపూరి బాగో లేదన్నందుకు వివాదం చెలరేగి చివరకు పోలీస్ స్టేషన్‌లోనే యువకుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న రాంనగర్ నివాసి వెంకటకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం పానీపూరి తినేందుకు తన తమ్ముడితో కలిసి రాణి నిర్వహిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు.
చదవండి: నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో..
పానీపూరి తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. ఇది నచ్చని నిర్వాహకురాలు వెంటనే అతనితో వాదనకు దిగింది. మాటామాట పెరగడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అనంతపురం రెండో పట్టణ ఎస్‌ఐ అల్లాబకాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విచారణ చేస్తున్న సమయంలో వెంకటకృష్ణారెడ్డిపై రాణి చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఘటనపై వెంకటకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆహారకల్తీ నిరోధకశాఖ, నగరపాలకసంస్థ అధికారులు వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు.