స్కాట్‌లాండ్‌లో పలమనేరు విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

స్కాట్‌లాండ్‌లో పలమనేరు విద్యార్థి మృతి

Published Thu, Aug 25 2022 2:20 PM

Palamaner Student Died in Scotland - Sakshi

సాక్షి, చిత్తూరు(పలమనేరు): కీలపట్లకు చెందిన విద్యార్థి స్కాట్‌లాండ్‌లో ఈనెల 19న మృతి చెందగా, మృతదేహాన్ని తెప్పించేందుకు బాధిత కుటుంబం అవస్థలు పడుతోంది. గంగవరం మండలం కీలపట్లకు చెందిన గ్రంది సుబ్రమణ్యం బెంగళూరులోని గంగానగర్‌లో కాపురముంటూ అక్కడే గ్లాస్‌వర్క్‌ షాపు నడుపుకుంటున్నాడు. ఇతని కుమారుడు గిరీష్‌కుమార్‌ లండన్‌లోని లీసెస్టర్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతున్నాడు.

ఇతనితోపాటు హైదరాబాద్‌కు చెందిన బాశెట్టి పవన్, చిలకమర్రి సాయివర్మ అక్కడే చదువుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మోడపల్లి సుధాకర్‌ సైతం లీసెస్టర్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వీరందరూ కలసి పంద్రాగస్టు వేడుకలను లండన్‌లో చేసుకున్నారు. ఆపై విహారం కోసం ఈనెల 19న స్కాట్‌లాండ్‌కు కారులో బయలు దేరారు. వెస్ట్రన్‌ స్కాట్‌ల్యాండ్‌లోని ఏ–8–27 రోడ్డులో వెళుతుండగా వీరి కారు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో గిరీష్‌(23) పవన్‌(22), సుధాకర్‌(30) మృతిచెందారు. సాయివర్మ అక్కడి గ్లాస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కాట్‌ల్యాండ్‌ పోలీసులు అక్కడి ఇండియన్‌ డిప్లమాటిక్‌ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి భారతవిదేశీ వ్యవహారాల శాఖ స్కాట్‌ల్యాండ్‌ అధికారులతో మాట్లాడింది.

అయితే మృతదేహాలను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఆలస్యమవుతున్నట్టు గిరీష్‌కుమార్‌ కుటుంబీకులు తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, బెంగళూరు గంగానగర్‌ ఎమ్మెల్యే శివకుమార్‌ భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్టు బాధితులు తెలిపారు. కర్ణాటక మఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మైని సైతం కలిసినట్టు తెలిసింది. మృతుని స్వగ్రామమైన కీలపట్లలో విషాదచాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలోని సుబ్రమణ్యం తల్లిదండ్రులు రామచంద్రయ్య, మునెమ్మ మనవడులేదన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

 
Advertisement
 
Advertisement