హైవే గ్యాంగ్‌: రెండేళ్లలో 10 అత్యాచారాలు, హత్యలు

Nuh Police Arrested Highway Gang to be Involved in 10 Cases of Molestation - Sakshi

క్రైమ్‌ కథా చిత్రాన్ని తలదన్నుతున్న హైవే గ్యాంగ్‌ అరచకాలు

గురుగ్రామ్‌: క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలంటే మనలో చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా సైకో పాత్రలతో నడిచే సినిమాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు కొందరు. ఇలాంటి సినిమాల్లో సైకో క్యారెక్టర్‌ వరుస హత్యలు చేస్తూ.. ఎలాంటి క్లూ దొరకకుండా పోలీసులను సవాలు చేస్తుంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త క్రైమ్‌ కథా చిత్రాలను మించి పోతుంది. 

నలుగురు మృగాళ్లు గ్యాంగ్‌గా ఏర్పడ్దారు. హైవేలే వారికి అనువైన ప్రదేశాలు.. రోడ్డు మీద ఒంటరిగా కనిపించే మహిళలే వారి టార్గెట్‌. లిఫ్ట్‌ ఇస్తామంటారు.. లేదంటే కిడ్నాప్‌ చేస్తారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. బాధితులు బతికుంటే తమకు ప్రమాదం అని భావించి హత్య చేస్తారు.. వారి ముఖాలను గుర్తు పట్టరాని విధంగా మార్చి.. కాలువల్లో పడేస్తారు. 

గత రెండుళ్లుగా ఈ గ్యాంగ్‌ ఇలా పదికి పైగా అత్యాచారాలు, హత్యలకు పాల్పడింది. ఈ కేసును సవాలుగా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ హైవే గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. హరియాణా నుహ్‌ పోలీసులకు గురువారం పట్టుబడ్డారు నిందితులు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

గత రెండేళ్లుగా హరియాణా నుహ్‌ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల కొన్ని జిల్లాలు, రాజస్తాన్‌ మేవాడ్‌ జిల్లాలో గుర్తు తెలియని మహిళల మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. బాధితుల శవాలన్ని ఎక్కువగా ఊరికి వెలుపల ఉన్న కాలువల్లోనే లభిస్తున్నాయి. ఇక బాధితులను గుర్తు పట్టకుండా వారి ముఖాలను అత్యంత దారుణంగా చెక్కుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే.. ఒక వ్యక్తి, గ్యాంగ్‌ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు అర్థం అవుతుంది. వీరిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. 

ఈ క్రమంలో నుహ్‌ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ఈ కేసులను పరిష్కరించడం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. దర్యాప్తులో ఈ దారుణాలన్ని ఎక్కువగా హైవేకు సమీపంలో చోటు చేసుకుంటున్నట్లు గుర్తించింది ప్రత్యేక బృందం. ఆ కోణంలో గాలింపు ప్రారంభించింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నలుగురు వ్యక్తుల గురించి ప్రత్యేక బృందానికి కొంత సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన బృందం మాటు వేసి.. హైవే గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులని అరెస్ట్‌ చేసింది. ఇక విచారణలో నిందితులు చెప్పిన విషయాలు పోలీసులనే భయపెట్టాయి. 

2018లో మొదలైన నేర చరిత్ర
దేవేందర్ అలియాస్ బాబ్లూ, మంజీత్, నాసిర్ మరియు రింకు అలియాస్ రిషబ్ హైవే గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. 2018లో వీరి నేర చర్రిత ప్రారంభమయ్యింది. 2018, ఏప్రిల్‌లో వీరు భివాడి హైవే మీదుగా వెళ్తుండగా.. వారికి రోడ్డు మీద ఓ యువతి కనిపించింది. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి.. తీసుకెళ్లి.. అత్యాచారం చేశారు. బాధితురాలు బతికుంటే ప్రమాదం అని భావించి హత్య చేసి ముఖం గుర్తు పట్టరాకుండా మార్చారు. ఆ తర్వాత మృతదేహన్ని కాలువలో పడేశారు.

తొలుత దొరికిపోతామని భయపడ్డారు. కానీ రెండు మూడు నెలలు గడిచినా ఏం జరగకపోయే సరికి మరింత రెచ్చిపోయారు. అలా 2018 నుంచి 2020 వరకు దాదాపు పది మందిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేర్వేరు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడేవారమని వెల్లడించారు. నేరం చేసిన చోట కాకుండా వేరే ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి పోలీసులను తప్పుదోవ పట్టించేవారు. ప్రస్తుతం ఈ నలగురు పోలీసుల అదుపులో ఉన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top