విదేశాల్లో ఉద్యోగం.. బహుమతులు.. చివరికి! | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఉద్యోగం.. బహుమతులు.. చివరికి!

Published Tue, Aug 10 2021 11:04 AM

Nigerian man Arrested By Cyber Crime Police For Cheating - Sakshi

సాక్షి. నాగోలు: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డబ్బులు కాజేస్తున్న నైజీరియన్‌ను రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన డెనియల్‌ ఒబియానో(30) స్టడెంట్‌ వీసాపై 2011లో భారత్‌కు వచ్చాడు. ముంబైలో డిగ్రీ, ఎంస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. తరువాత 2018లో బెంగుళూరుకు వెళ్లి తన స్నేహితులను కలుసుకున్నాడు. తన స్నేహితుల ద్వారా ఆన్‌లైన్, సైబర్‌ మోసాల గురించి తెలుసుకున్నాడు. తన స్నేహితులైన బాంకె, ఓకా ఓయిస్, అబుజాబ్రోతో కలసి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచారు. దీంతో విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల నుంచి బహుమతుల వచ్చాయంటూ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు.

విదేశాల నుంచి బహుమతులు వచ్చాయంటూ కస్టమ్‌ అధికారులుగా మాట్లాడి కొంత డబ్బు చెల్లించాలని చెప్పి తమ ఖాతాలకు నగదు బదిలీ చేయించుకునేవారు. కుషాయిగూడకు చెందిన వ్యక్తికి కెనడాలోని పెప్సికో కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్, ఆఫర్‌ లెటర్, వీసా ఫీజు, ఇతర ఖర్చులకు బధితుడి నుంచి ర.51.32లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. తరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో వెసపోయినట్లు గుర్తించి బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డెనియల్‌ ఒబియానోను అరెస్టు చేసి రివండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు, వివిధ బ్యాంకుల ఖాతాలలో ఉన్న రూ.7.12 లక్షల నగదును ఫ్రీజ్‌ చేశారు. 

Advertisement
Advertisement