ఐయామ్‌ వరుణ్‌ రావ్‌ ఫ్రమ్‌ యూఎస్‌ఏ.. త్వరలో పెళ్లి చేసుకొని కోట్లు సంపాదిద్దాం

Nigerian held for duping woman of Rs 18 lakh on pretext of marriage - Sakshi

గిఫ్ట్‌ పంపుతున్నా అంటూ యువతి నుంచి రూ. 18 లక్షలు స్వాహా 

యూపీలో ఉంటూ యూఎస్, యూకే ఫోన్‌ నంబర్స్‌తో దందా 

మూడు ల్యాప్‌టాప్స్, 8 మొబైల్స్, పది సిమ్‌లు, 

రెండు ఏటీఎంలు స్వాధీనం 

సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌

సాక్షి, హైదరాబాద్‌(హిమాయత్‌నగర్‌): అమెరికాలో ఉన్నత ఉద్యోగం, ఇద్దరం కలసి త్వరలో ఒక్కటై కోట్లు సంపాదించవచ్చు. నేను ఇండియా వచ్చే వరకు ఆలస్యం అవుతున్న కారంగా నీకొక గిఫ్ట్‌ పంపుతున్నా తీసుకో అంటూ..మరుసటి రోజు నుంచి కస్టమ్స్‌ పేరుతో లక్షల రూపాయిలు లూటీ చేసిన నైజీరియన్‌ కటకటాలపాలైయ్యాడు. అతగాడి నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, 8 మొబైల్‌ ఫోన్‌లు, పది సిమ్‌కార్డులు, రెండు డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ తెలిపారు.

ఎస్సార్‌నగర్‌కు చెందిన యువతి కొద్దిరోజు క్రితం పెళ్లికోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈమె ప్రొఫైల్‌ చూసిన నైజీరియన్‌ యూఎస్‌ఏలో సివిల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నానని తన పేరు వరుణ్‌రావుగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి ఫోన్‌ నంబర్‌లు ఇచ్చి పుచ్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గంటలకొద్దీ ఫోన్‌లలో మాట్లాడుకున్నారు. తాను యూఎస్‌ఏ నుంచి ఇండియాకు వచ్చే లోపు ఆసల్యం అవుతున్న కారణంగా ముందుగా బంగారు ఆభరణాలు, యూఎస్‌ డాలర్స్, ఖరీదైన ఫోన్‌లను గిఫ్ట్‌ రూపంలో పంపుతున్నాను తీసుకోమన్నాడు.

మరుసటి రోజే స్టార్ట్‌ అయ్యింది ఢిల్లీలోని కస్టమ్స్‌ అధికారులమంటూ యువతికి వల వేశారు. మీకు రావాల్సిన గిఫ్టŠస్‌కి మీరు కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీంతో యువతి పలు దఫాలుగా రూ. 18 లక్షలు చెల్లించి మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడాలో బట్టల వ్యాపారం చేస్తున్న నైజీరియన్‌ అములోన్యే ప్రిన్స్‌ ఫ్లెక్స్‌(50)ను అరెస్ట్‌ చేశారు.

ఇతగాడిని విచారించగా.. గతంలో అనేకమందికి ఇలా వల వేసి లక్షలాది రూపాయిలు దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు. 2012లో నైజీరియన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన అములోన్యే ప్రిన్స్‌ ఫ్లెక్స్‌ వీసా గడువు ముగిసినాక కూడా ఇక్కడే ఉంటూ..ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్నణట్లు నిర్థారణ అయ్యింది. ఈ విధమైన మోసాల్లో నగరవాసులు చిక్కుకోవద్దంటూ సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top