రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Narcotics Control Bureau arrested Rhea Chakraborty brother Showik - Sakshi

డ్రగ్స్‌ గుట్టువిప్పిన ఆమె సోదరుడు షోవిక్‌

బాలీవుడ్‌లో కలకలం

సుశాంత్‌ కేసులో అరెస్టుల పర్వం

ముంబై: సినీనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. బాలీవుడ్‌తో పెనవేసుకుపోయిన డ్రగ్స్‌ మాఫియా చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి.

రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ని ఎన్‌సీబీ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేయడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ తీగలాగితే డొంక కదలినట్టుగా బయటకొస్తోంది. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో పెద్దచేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో అనూహ్యమైన విషయాలెన్నో బయటపడుతున్నాయని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సౌత్‌ వెస్ట్‌ రీజియన్‌ ముత్తా అశోక్‌ జైన్‌ మీడియాకి వెల్లడించారు.

విచారణలో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సంచలన విషయాలను బయటపెట్టారని, రియా చక్రవర్తి చెపితేనే మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్‌ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్‌ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని షోవిక్‌ విచారణలో ఒప్పుకున్నాడని వారు వెల్లడించారు. రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్‌ డేటా ఆధారంగా ఎన్‌సీబీ నిర్ధారణకు వచ్చింది.

ఆదివారం రియాను విచారణకు పిలిచి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. షోవిక్‌తో పాటు ఇప్పటికే అరెస్టయిన వారిని... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్‌సీబీ అధికారి అశోక్‌ జైన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా సుశాంత్‌ సింగ్‌ వ్యక్తిగత సహాయకుడు దీపేశ్‌ సావంత్‌ని శనివారం అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్‌ సిండికేట్‌లో షోవిక్‌ను భాగస్వామిగా గుర్తించిన ఎన్‌సీబీ అతను ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఎలా సేకరించాడనే విషయాన్ని ఆరా తీస్తోంది.

సుశాంత్‌ నివాసానికి సీబీఐ బృందం
బాంద్రాలోని మోంట్‌బ్లాంక్‌ అపార్ట్‌మెంట్స్‌లోని సుశాంత్‌ సింగ్‌ ఫ్లాట్‌ని, ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి, సీబీఐ బృందం శనివారం పరిశీలించింది. రాజ్‌పుత్‌ వంట మనుషులు నీరజ్, కేశవ్, సుశాంత్‌తో కలిసి అదే ఫ్లాట్‌లో నివసించిన సిద్ధార్థ్‌ పితానిలను సైతం సీబీఐ బృందం తమ వెంట తీసుకెళ్ళింది. ఇదే ఫ్లాట్‌లో జూన్‌ 14న సుశాంత్‌ ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే.  

ఎన్‌సీబీ కస్టడీకి షోవిక్, మిరాండా  
షోవిక్‌ చక్రవర్తి అనేక మందికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని, ఇతనికి మరో నిందితుడు అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌తో సంబంధాలున్నాయని ఎన్‌సీబీ స్థానిక కోర్టుకి వెల్లడించింది. షోవిక్‌ను, సుశాంత్‌ సింగ్‌ హౌస్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాను సెప్టెంబర్‌ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి కోర్టు అప్పగించింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనేకమార్లు సుశాంత్‌ ఆత్మహత్యాయత్నాలు చేయడం లాంటి విషయాలపై వ్యక్తిగత సహాయకుడు దీపేశ్‌ సావంత్, ప్రధాన ముద్దాయి రియా చక్రవర్తితో కలిపి షోవిక్‌ను, ముఖాముఖి విచారించాల్సి ఉందని కోర్టుకి ఎన్‌సీబీ తెలిపింది.

మాదక ద్రవ్యాల సరఫరా కేసులో ఇదివరకే అరెస్టయిన బాసిత్‌ పరిహార్‌తో, షోవిక్, మిరాండాలు సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్‌సీబీ తెలిపింది. ఈ విచారణలో షోవిక్‌ మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన అనేక మంది పేర్లను బయటపెట్టినట్లు కూడా ఎన్‌సీబీ వెల్లడించింది. కాల్‌ డేటా విశ్లేషణ, వాట్సాప్‌ చాట్స్, ప్రాథమిక విచారణలో బయటకొచ్చిన కొందరి పేర్లను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన మరో ముద్దాయి కైజన్‌ ఇబ్రహీంని కూడా కోర్టులో ప్రవేశపెట్టారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top