Bombay Saleem: 22 ఏళ్లుగా నేరాలు.. 300 కేసులు.. ముంబైలో చిక్కాడు! 

Mumbai Police Caught Thief Known As Bombay Saleem - Sakshi

22 ఏళ్ళుగా దేశ వ్యాప్తంగా నేరాలు చేస్తున్న దొంగ 

2001లో డాన్‌ ఛోటా రాజన్‌ ఇంట్లోనూ చేతివాటం 

అనుచరుడిగా మారిన హైదరాబాదీ గౌస్‌ షేక్‌ 

తెలంగాణలోనూ ఇతడిపై 65 కేసులు నమోదు 

పెండింగ్‌లో పలు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు 

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు సలీమ్‌ హబీబ్‌ ఖురేషీ... బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 49 ఏళ్ల వయస్కుడైన ఇతడిపై దేశ వ్యాప్తంగా 300 కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన గౌస్‌ షేక్‌ ను అనుచరుడిగా మార్చుకుని పంజా విసురుతున్న ఇతగాడిపై తెలంగాణలోనూ 65 కేసులు ఉన్నాయి. ఆఖరుసారిగా 2012లో రాజేంద్రనగర్‌  సీసీఎస్‌ పోలీసులకు చిక్కాడు. ఇతడిపై రాష్ట్రంలోని అనేక పోలీసుస్టేషన్లలో నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌బీడ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల 18న ముంబయ్‌లోని  పొవాయ్‌ ఠాణా పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులో అక్కడి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సలీం, గౌస్‌లతో పాటు తౌఫీఖ్‌ అనే మరో అనుచరుడినీ పట్టుకున్నారు.  
►ముంబయ్‌లోని గోవంది ప్రాంతంలోని టాటానగర్‌ స్లమ్‌లో ఉన్న డియోనార్‌ బుచ్చర్‌ హౌస్‌కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్ళల్లో ముంబయ్‌లో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. 
►2001లో ముంబయ్‌లోని చెంబూర్‌ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్‌ ఓ ఇంటిని టార్గెట్‌గా చేసుకుంది. అదే రోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీంకు తాము చోరీ చేసింది మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. 
►కొన్నాళ్ల తరవాత బాంబే సలీం అరెస్టు చేసిన ముంబయ్‌ పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్‌ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో బెయిల్‌పై వచ్చిన వెంటనే రాజన్‌ అనుచరుల్ని కలిసిన సలీం జరిగింది చెప్పి ముంబయ్‌ వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు.  
►ముంబయ్‌ నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్‌ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ... గ్యాంగ్‌ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించే వాడు. ఇతడి కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు.  
►సలీం జాబితాలో కేసుల సంఖ్య పెరగడం, నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబయ్‌ పోలీసుల కళ్లు కప్పడం కోసం సలీం హైదరాబాద్‌లో కొంతకాలం షెల్టర్‌ తీసుకున్నాడు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదారాబాద్‌ వచ్చి వేర్వేరు ఇళ్ళు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టి కొన్నాళ్లు నడిపాడు.  
►ఇది నష్టాలు రావడంతో నగరవాసి గౌస్‌తో కలిసి మళ్లీ చోరీల బాటపడ్డాడు. చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, సరూర్‌నగర్, శివరామ్‌పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్‌పేట్, ఇబ్రహీంపట్నంల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబయ్‌ తదితర నగరాలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చాడు.  
►ఈ రకంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 300కు పైగా నేరాలు చేశాడు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడకు మకాం మార్చాడు. రాజేంద్రనగర్‌ సీసీఎస్‌ పోలీసులు సుదీర్ఘకాలం సలీంపై నిఘా ఉంచి 2012 ఫిబ్రవరి 28న పట్టుకుని రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.  
►సలీం 2012 తర్వాత తన స్టైల్‌ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్‌ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. స్టార్‌ హోటల్స్‌లో బస చేసే ఇతగాడు ఖరీదైన కార్లను సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో కొని వినియోగిస్తుంటాడు. గత నెల 18న ముంబయ్‌లోని జల్‌ వాయు విహార్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో తన ఇద్దరు అనుచరులతో కలిసి చోరీ చేశాడు.  
►దీనిపై కేసు నమోదు చేసుకున్న పొవాయ్‌ ఠాణా అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బెంగళూరులో ఉన్న అనుచరులను ఈ నెల 2న పట్టుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సలీంను శుక్రవారం అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇతడితో పాటు గౌస్‌పై తెలంగాణలో కొన్ని ఎన్‌బీడ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top