హైదరాబాద్‌: యువతుల అదృశ్యం.. టెన్షన్‌ | Missing Cases Filed In Hyderabad | Sakshi
Sakshi News home page

కలవరపెడుతున్న మహిళల అదృశ్యం

Oct 31 2020 12:05 PM | Updated on Oct 31 2020 12:14 PM

Missing Cases Filed In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒకరి తరువాత మరొకరు రోజుల తరబడి అడ్రస్‌ లేకుండా పోతున్నారు. మిస్సింగ్‌ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలో వరుస అదృశ్య కేసులు కలవరపెడుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు రోజుల తరబడి అడ్రస్‌ లేకుండా పోతున్నారు. మిస్సింగ్‌ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వర్గాల సమచారం ప్రకారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు, కూకట్‌పల్లిలో పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. తాజాగా హైదరాబాద్‌ నగరం పరిధిలో మరో మూడు అదృశ్య కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాల ప్రకారం.. మందుల షాపుకని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన హుస్సేనీ ఆలం పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖాజిపురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ బిన్‌ మహమూద్‌ కూతురు సబినా బిన్‌ మహమూద్‌ (22) ఈ నెల 28న మందుల దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె సోదరుడు అబుబాకర్‌ బిన్‌ మహ్మద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే రోజు సాయంత్రం 7.30 గంటలకు ఆమె తనకు ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నాను.. నా కోసం వెతకవద్దని తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌ 040–27854793, 9490616488, 8985465178 నంబర్లకు తెలపాలని పోలీసులు సూచించారు.

చిన్నారితో సహా తల్లి..
చాంద్రాయణగుట్ట : రెండు నెలల చిన్నారి కూతురుతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పీఎస్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అరవింద్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. ఉప్పుగూడ అంబికానగర్‌కు చెందిన పండరి కుమార్తె శృతి (20) మూడు నెలల క్రితం సదాశివపేటలోని అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ప్రసవం కోసం వచ్చింది. ప్రస్తుతం ఆమెకు రెండు నెలల చిన్నారి ఉంది. నెల రోజుల క్రితం శృతి ఉదయం పాపతో కలిసి ఇంటి నుంచి వెళ్లి రాత్రి వచ్చింది. ఎక్కడికి వెళ్లావని తల్లి సుశీల అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఈ నెల 24న మరోసారి ఇంటి నుంచి పాపతో పాటు వెళ్లిపోయిన శృతి ఎంతకి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక స్టేషన్‌లో గాని సెల్‌ 9490616500 నంబర్‌లో గాని తెలపాలని కోరారు.

మహిళ అదృశ్యం
అమీర్‌పేట : భర్త మృతిచెందడంతో డిప్రెషన్‌కు గురైన ఓ మహిళ కనిపించకుండ పోయిన ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ ఆంజనేయులు వివరాల ప్రకారం బోరబండ వినాయక్‌రావునగర్‌లో ఉండే వి.సునీత (45 ) ఆమె భర్త ఆనంద్‌ ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సునీత ఈ నెల 27వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వివిధ చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె సోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచుకీ తెలిసినవారు పోలీస్‌ స్టేషన్‌లో లేదా 9515874814 ఫోన్‌ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement