Srikakulam Crime: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు..

Married Woman Dies After Falling Into Pond In Srikakulam District - Sakshi

జలుమూరు(శ్రీకాకుళం జిల్లా): ఆకలంటే అమ్మ తినిపించాలి.. భయం వేస్తే అమ్మను పట్టుకోవాలి.. ఏడిస్తే ఆ తల్లే ఓదార్చాలి. పొద్దస్తమానం అమ్మ కొంగు పట్టుకునే తిరగాలి. ఆరు, ఐదేళ్ల పిల్లల దినచర్య ఇది. కానీ ఇప్పుడా పిల్లలకు ఆకలంటే అమ్మ రాలేదు. భయం వేస్తే తల్లి ఓదార్చలేదు. ఎంత ఏడిచినా అమ్మ పలకడం లేదు. రెండేళ్ల కిందట తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు చిన్నారులకు ఇప్పుడు అమ్మ కూడా దూరమైపోయింది. మండలంలోని అల్లాడపేటకు చెందిన కోట రోహిణి(32) మంగళవారం చెరువులో పడి మృతి చెందారు.

చదవండి: ‘అదృశ్యం’లో చిక్కుముడులు.. ‘బూచోడు కొట్టాడు’.. సమాధానం లేని ప్రశ్నలెన్నో?

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడపేటకు చెందిన రోహిణికి ప్రకాశం జిల్లాకు చెందిన మదన్‌మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి వెంకటేశ్‌(6), లాస్య(5)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట రోహి ణి భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రోహిణి కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తున్నారు. పది రోజుల కిందటే కన్నవారింటికి వచ్చా రు. నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న రోహిణి మంగళవారం గ్రామ శివారున ఉన్న చెరువు వద్దకు స్నానం కోసం వెళ్లారు.

చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..?

బట్టలు ఉతికి చెరువులో దిగగా.. అదే చోట లోతుగా ఉండడంతో లోపలకు వెళ్లిపోయారు. అవతలి గట్టున ఉన్న రజకులు ఆమెను చూసి రక్షించేందుకు హుటాహుటిన ఈ ఒడ్డుకు వచ్చారు. అప్పటికే రోహిణి అధికంగా నీరు తాగేయడంతో ప్రాణాలు పోయాయి. మృతురాలి తల్లి రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పారినాయుడు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి తరలించారు. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు ‘అమ్మ లేవడం లేదేంటి’ అని అమ్మమ్మను అడుగుతుంటే చూసిన వారంతా కంటనీరు పెట్టుకున్నారు. రెండేళ్ల లోపే అమ్మానాన్నలను దూరం చేసుకున్న పిల్లలను చూసి అయ్యో అంటూ నిట్టూర్చారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top