‘అదృశ్యం’లో చిక్కుముడులు.. ‘బూచోడు కొట్టాడు’.. సమాధానం లేని ప్రశ్నలెన్నో?

Tangles In Child Missing case In Chittoor District - Sakshi

కుప్పం(చిత్తూరు జిల్లా): మండలంలోని నక్కలగుట్ట గ్రామంలో మణి, కవిత దంపతులు నివసిస్తున్నారు. వారికి జోషిక(4) అనే కుమార్తె. శనివారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి హఠాత్తుగా కనపడకుండా పోయింది. అటవీప్రాంతానికి ఆనుకునే వీరి నివాసం ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. స్థానికులతో కలిసి చుట్టపక్కల గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శరవేగంగా స్పందించి సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు విడిపోయి అటవీప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: ఫస్ట్‌నైట్‌ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి

అంతలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. శనివారం రాత్రి గడిచింది. ఆదివారం కూడా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అడవిలోకి మేకలు తోలుకెళ్లిన కాపరులకు చిన్నారి జోషిక కనిపించింది. ఈ ప్రాంతం పాప ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటిపై దుస్తులు లేని స్థితిలో ఉన్న బాలికను వెంటనే వారు గ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

క్షేమంగా చిన్నారి జోషిక ఇంటికి చేరినా పరిస్థితి దయనీయంగానే ఉంది. కాళ్లు, చేతులపై ముళ్ల కంపలు గీసుకున్న గాయాలున్నాయి. ఆహారం తీసుకోవడం లేదు. జ్యూస్‌ ఇస్తే కొద్దిగా తాగుతోంది. తనను పలకరిస్తే భయపడిపోతోంది. చుట్టూ చేరిన జనాలను చూసి ఏడుస్తోంది. ఏం జరిగిందని తల్లి కవిత ఆరాతీస్తే బూచోడు కొట్టాడు అని సమాధానమిస్తోంది. తినడానికి ఎవరు ఏమిచ్చినా నోటికి చేయి అడ్డుపెట్టుకుని వద్దని చెబుతోంది. నిద్రబుచ్చిన కాసేపటికే ఉలిక్కిపడి లేస్తోంది. 

అనుమానాలు లేవు 
చిన్నారి జోషిక అదృశ్యం వెనుక ఎలాంటి అనుమానాలు లేవని ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. 36 గంటల మిస్టరీపై ‘సాక్షి’ ఎస్‌ఐ వివరణ కోరగా మిస్సింగ్‌ కేసు మాత్రమే నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాప చెబుతున్న బూచోడు, గాయాల విషయమై ప్రశ్నించగా అదేం లేదని సమాధానం దాటవేశారు.

సమాధానం లేని ప్రశ్నలెన్నో..?
మాటలు కూడా సరిగా రాని చిన్నారి అంతలా ఎందుకు భయపడుతోంది. అడవిలో అన్ని గంటలపాటు ఎలా ఉండగలిగింది. అందులోనూ శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఎలా తట్టుకుంది. అనే ప్రశ్నలు స్థానికులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా బాలికను అపహరించారా..? పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టడం చూసి చిన్నారిని వదిలేశారా..? బాలిక చెబుతున్న బూచోడే ఎత్తుకెళ్లాడా..? తిండి, నీరు లేకుండా ముక్కుపచ్చలారని పసిబిడ్డ ఒంటరిగా అడవిలో ఎలా ఉండగలిగింది. ఎలాంటి అమానుష అనుభవం ఎదురై ఉంటే చిన్నారి అంతలా వణికిపోతోంది. మొత్తం విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top