కరోనా చికిత్స కోసం వచ్చి.. పోలీసులకు చిక్కాడు...!

Maoist Caught By Warangal Police Due To Corona - Sakshi

మావోయిస్టు ముఖ్య నేత మధుకర్‌ అరెస్టు

మరికొందరు నేతలు కరోనాతో బాధపడుతున్నట్లు విచారణలో వెల్లడి 

బయటకు వస్తే ప్రభుత్వం చికిత్స చేయిస్తుంది.. 

 వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి 

వరంగల్‌ క్రైం: కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం వరంగల్‌కు వస్తున్న మావోయిస్టు పార్టీ ముఖ్యనేత గడ్డం మధుకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సాయంగా ఉన్న ఓ మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వరంగల్‌ సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వరంగల్‌లోని ములుగురోడ్డు క్రాస్‌ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా ములుగు నుంచి వస్తున్న కారు వెనక భాగంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, అలియాస్‌ మోహన్, అలియాస్‌ శోభ్రాయ్‌గా గుర్తించారు.

ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన గడ్డం మధుకర్‌ 1999లో సిర్పూర్‌ దళంలో చేరగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. 2000 సంవత్సరంలో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీకి వెళ్లిన ఆయన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనూ విధ్వంసకర ఘటనలకు పాల్పడటమే కాకుండా పలువురు పోలీసులను హత్య చేసి వారి ఆయుధాలను ఎత్తుకెళ్లాడు. ఇక హన్మకొండ గోపాల్‌పూర్‌కు చెందిన మావోయిస్టు పార్టీ మైనర్‌ కొరియర్‌ పాలిటెక్నిక్‌ మధ్యలో ఆపివేసి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్‌తో బాధపడుతున్న మావోయిస్టు నాయకుడిని మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఆస్పత్రిలో చేర్పించాలని నరేశ్‌ మరో కొరియర్‌ గత నెల 31న ఫోన్‌ ద్వారా కోరడంతో మైనర్‌ కొరియర్‌ మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మీదుగా వెంకటాపూర్‌ అటవీ ప్రాంతం నుంచి గడ్డం మధుకర్‌ను కారు వెనక భాగంలో పడుకోబెట్టి తీసుకువస్తుండగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.80 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నామని, మధుకర్‌ను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని సీపీ తరుణ్‌ జోషి వెల్లడించారు. 

మావోయిస్టు కీలక నేతలకు కోవిడ్‌ 
మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది కీలక నాయకులు కోవిడ్‌తో బాధపడుతున్నట్లు మధుకర్‌ తెలిపాడని సీసీ వెల్లడించారు. ఇందులో కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజీ, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కున్‌కటి వెంకటయ్య అలియాస్‌ వికాస్, ముచ్చకి ఉన్‌జల్‌ అలియాస్‌ రఘు, కోడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుద్రా తదితరులు కరోనాతో బాధపడుతున్నా మావోయిస్టు పార్టీ వీరిని చికిత్సకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల దామోదర్‌కు గార్డ్‌గా ఉన్న మావోయిస్టు సభ్యుడు చికిత్స కోసం క్యాంపు నుంచి తప్పించుకుపోతుండగా పోలీసులకు పట్టుబడినట్లు ఆయన చెప్పారు.  కాగా, కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు బయటకు వస్తే ప్రభుత్వం మెరుగైన చికిత్స చేయించడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ గిరికుమార్, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ తౌటం గణేష్‌ పాల్గొన్నారు. 

వ్యాక్సిన్లూ వేయిస్తున్నారు
కరోనా తీవ్రతను తట్టుకోలేక ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్న పలువురు అగ్రనాయకులు తమ కొరియర్లను తెలంగాణలోకి పంపించి పెద్ద ఎత్తున కరోనా చికిత్స మందులను సమకూర్చుకుంటున్నారని, వయసు మీద పడిన నేతలను సాధారణ గ్రామస్తుల రూపంలో తీసుకు వచ్చి ఇక్కడ వ్యాక్సిన్లు కూడా వేయిస్తున్నట్లు తమ నిఘా వర్గాలు గుర్తించాయని సీపీ జోషి తెలిపారు.   

16 ఏళ్ల వయసులో ఉద్యమ బాట
సాక్షి, మంచిర్యాల: పీపుల్స్‌వార్‌ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో మధుకర్‌ ఉద్యమబాట పట్టాడు. 22 ఏళ్లుగా కన్నవారిని చూడకుండా అజ్ఞాతంలో గడిపాడు. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌ పేట మండలం మారుమూల గ్రామం కొండపల్లి ఇతని స్వస్థలం. 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరాడు. తొలుత స్థానిక సిర్పూర్‌ దళంలో పనిచేశాడు. తర్వాత దండకారణ్యానికి వెళ్లిపోయాడు. మధుకర్‌ తల్లి చనిపోగా తండ్రి బాపు, సోదరులు సుధాకర్, రాజు, సోదరి భాగ్య ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఇన్నాళ్లు ఆయనకు సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు. తాజా అరెస్టుతో కుటుంబ సభ్యులకు మొదటిసారిగా ఆయన గురించి వివరాలు తెలిశాయని స్థానికులు అంటున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top