విశాఖలో షాకింగ్‌ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..

Man Who Assassinated His Girlfriend In Visakhapatnam - Sakshi

అల్లిపురం (విశాఖ దక్షిణం): తనతో కాకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అక్కసుతో ప్రియురాలి ప్రాణం తీసిన హంతకుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన శనివారం విశాఖ మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. నగర శాంతిభద్రతల డీసీపీ విద్యాసాగరనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా, కొత్తవలస, కుమ్మరవీధికి చెందిన కోడి శ్రావణి (27)  గాజువాక దరి తుంగ్లాంలో నివాసం ఉండేది.

తర్వాత ఉపాధి నిమిత్తం విజయనగరం జిల్లా కొత్తవలసకు మకాం మార్చింది. అనంతరం ఆమెకు పెళ్లి జరగ్గా భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఒక గది అద్దెకు తీసుకుని జగదాంబ సమీపంలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె గతంలో తుంగ్లాంలో ఉన్నప్పుడు పరిచయమైన పెయింటర్‌ శ్రీపెరంబూరు గోపాలకృష్ణ అలియాస్‌ గోపాల్‌ను  ప్రేమించింది.

ఈ క్రమంలో గోపాలకృష్ణ అతని స్నేహితుడు వడ్లపూడికి చెందిన రాగిణి వెంకటేష్‌ అలియాస్‌ వెంకీని శ్రావణికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త శ్రావణి, వెంకీ మధ్య ప్రేమగా మారింది. దీంతో తాను వెంకటేష్‌ను ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణకు శ్రావణి చెప్పింది. వెంకటేష్‌ను శ్రావణి ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ.. వారిద్దరితో కలిసి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆర్‌కే బీచ్‌కు చేరుకున్నాడు.

అక్కడ వారిద్దరితో మాట్లాడిన తర్వాత.. శ్రావణితో వ్యక్తిగతంగా మాట్లాడాలని వెంకటేష్‌ను గోకుల్‌పార్కులో కూర్చోమని చెప్పి.. శ్రావణిని తీరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు గోపాలకృష్ణ తీసుకెళ్లాడు. కొంత సేపటికి గోపాలకృష్ణ ఒక్కడే వచ్చి మంచి నీరు తీసుకొస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిపోయాడు. అనంతరం గోపాలకృష్ణ ఎప్పటికీ రాకపోవడంతో వెంకటేష్‌ అతని కోసం చూస్తున్నాడు. ఇంతలో గాజువాక పోలీసుల నుంచి వెంకటేష్‌కు ఫోన్‌ వచ్చింది. మీ స్నేహితుడు గోపాలకృష్ణ బీచ్‌లో ఎవరినో పీక నులిమి చంపేశానని చెబుతున్నాడని.. బీచ్‌లోకి వెళ్లి  చూసి చెప్పమని పోలీసులు చెప్పారు.
చదవండి: యూట్యూబ్‌ చూసి దొంగనోట్ల ముద్రణ 

దీంతో తీరంలో వెతగ్గా ఒక చోట శ్రావణి చనిపోయి పడి ఉంది. విషయాన్ని వెంకటేష్‌ పోలీసులకు తెలియజేశాడు. దీంతో గాజువాక పోలీసులు మహారాణిపేట పోలీసులకు సమాచారం అందిచడంతో నైట్‌ రౌండ్స్‌లో ఉన్న క్రైం ఎస్‌ఐ నెమరంబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు నిందితుడు గోపాలకృష్ణ, అతని స్నేహితుడు వెంకటేష్‌ నుంచి వాగ్మూలం తీసుకున్న అనంతరం, మృతురాలి తల్లి కోడి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  ఈస్ట్‌ ఏసీపీ రమణమూర్తి, మహారాణిపేట సీఐ బి.రమణమూర్తి పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top