యూట్యూబ్‌ చూసి దొంగనోట్ల ముద్రణ  | Man Caught Printing Fake Currency Notes | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ చూసి దొంగనోట్ల ముద్రణ 

May 21 2023 5:00 AM | Updated on May 21 2023 5:00 AM

Man Caught Printing Fake Currency Notes - Sakshi

పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి.  పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్‌ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేశాడు.

ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్‌ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్‌ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్‌ పేపర్లు, కలర్లు, గ్రీన్‌ కలర్‌ నెయిల్‌ పాలీష్‌ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు.

రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్‌ కోసం గ్రీన్‌ నెయిల్‌ పాలిష్‌ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్ట్‌ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్‌ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు  తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement