దారుణం: ప్రేమించి పెళ్లిచేసుకొని.. రెండు కత్తులతో

Man Assassination His Wife In Chittoor District - Sakshi

సాక్షి, పెనుమూరు(చిత్తూరు జిల్లా): ప్రేమించిన యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు.. ఉన్మాదిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రేమికురాలిని అడ్డగించి గొంతు కోసి.. కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంప్రాలకొత్తూరు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తూర్పుపల్లెకు చెందిన షణ్ముగరెడ్డి కుమార్తె గాయత్రి(20) పెనుమూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన ఎం.సుబ్బయ్య కుమారుడు ఢిల్లీబాబు(19) చిత్తూరులో డిగ్రీ చదువుతున్నాడు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం తెలిసిన గాయత్రి తల్లిదండ్రులు.. ఆమెను మందలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 11న వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. దీనిపై గాయత్రి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో ఉన్న ఢిల్లీ బాబు, గాయత్రిని పోలీసులు గత నెల 13న పెనుమూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. గాయత్రిని వివాహం చేసుకున్నట్లు ఢిల్లీ బాబు తెలిపాడు. అయితే ఢిల్లీ బాబుకు పెళ్లి వయసు రాకపోవడంతో.. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులతో వెళ్లేందుకు గాయత్రి అంగీకరించడంతో.. ఆమెను వారితో పంపించారు. చదవండి: (అక్రమ సంబంధం.. రాక్షసునిగా మారిన భర్త)

రెండు కత్తులతో.. 
గాయత్రి ఇటీవల సంక్రాంతి పండుగ కోసం వెదురు కుప్పం మండలం ఎగువ కనికాపురంలో ఉన్న మేనత్త ఇంటికి వెళ్లింది. తిరిగి మంగళవారం ఉదయం మేనత్త కూతురు రమ్యతో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బాబు మంగళవారం పెనుమూరు మండలం ఎంప్రాలకొత్తూరు సమీపంలోని నర్సరీ వద్ద కాపు కాశాడు. మధ్యాహ్నం 12.50కి గాయత్రిని అడ్డుకున్నాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న రెండు కత్తుల్లో ఒకదానితో గాయత్రి గొంతు కోశాడు. మరో కత్తితో ఆమె పొట్టపై కిరాతకంగా పలుమార్లు పొడిచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న గాయత్రిని స్థానికులు పెనుమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం చీలాపల్లె సీఎంసీకి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనాస్థలిలో నిందితుడు వదిలి వెళ్లిన రెండు కత్తులు, యువతి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  గాయత్రి హత్య విషయం తెలుసుకున్న తూర్పుపల్లె గ్రామస్తులు.. చింతమాకులపల్లెకు వెళ్లి నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. అతని తల్లిదండ్రులపై దాడి చేశారు. కేసు నమోదు చేశామని.. నిందితుడు పరారీలో ఉన్నాడని పెనుమూరు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top