ఉలిక్కిపడ్డ ములకలేడు... తెల్లారిన బతుకులు

LPG Gas Cylinder Explode Four People Dead - Sakshi

శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో  చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  

ఏం జరిగిందంటే..  
ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్‌ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్‌ సెంటర్‌లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్‌ సాహెబ్‌ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్‌ సాహెబ్‌ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్‌ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్‌ ఇంట్లో లైట్లు ఆన్‌ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్‌ సాహెబ్‌ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.  

ఉలిక్కిపడిన గ్రామం.. 
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది.  ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్‌ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు.  విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్‌ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్‌ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్‌ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు.  

అంత్యక్రియలకు వెళ్లివచ్చి... 
దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

మంత్రి దిగ్భ్రాంతి.. 
ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్‌ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్‌ నాగరాజు, మన్సూర్‌ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్‌ నాగరాజు, ఎస్‌ఐ యువరాజ్‌ సమక్షంలో వైఎస్సార్‌ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు.  

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. 
ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌ తలారి రాజు, వ్యవసాయ మిషన్‌ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. 

పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం
తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్‌ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు.      
  – అబ్దుల్‌ రహమాన్, ములకలేడు  

(చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్‌ చేశారు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top