జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు 

Letter From Young Woman To Karnataka High Court In CD Case - Sakshi

సీడీ కేసులో కర్ణాటక హైకోర్టుకు యువతి లేఖ 

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల కేసులో బాధిత యువతి సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరులో కోర్టులో లొంగిపోతుందని ఆమె న్యాయవాది జగదీశ్‌ ఆదివారం చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తేలింది. రమేశ్‌ జార్కిహొళిపై పలు ఆరోపణలను చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. 

లేఖలో ఏమి ఉందంటే? 
‘‘రమేశ్‌ జార్కిహొళి ప్రమాదకర వ్యక్తి. సామాన్యులను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ అవసరం. సిట్‌తో దర్యాప్తు చేయించాలి. జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు (హైకోర్టు సీజే) న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. జార్కిహొళి ఏ సమయంలో అయినా నన్ను చంపేస్తాడు’’అని లేఖలో యువతి ఆరోపించింది. 

సిట్‌ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. జార్కిహోళి ఓ క్రిమినల్‌. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్‌లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జార్కిహొళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు’అని ఆరోపణలు చేసింది. మరోవైపు ఆమె హైకోర్టులో హాజరు కావడానికి అనుమతి వచ్చిందని న్యాయవాది జగదీశ్‌ తెలిపారు.  చదవండి: (రాసలీల కేసు: అజ్ఞాతం వీడనున్న యువతి?)

సిట్‌ ముందుకు జార్కిహొళి 
రమేశ్‌ జార్కిహొళి సోమవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావడం ఇది మూడోసారి. ఆ యువతితో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు తెలిసింది. సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. తన తరఫు న్యాయవాదులతో కలిసిన అనంతరం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఇందుకోసం నాలుగు రోజుల సమయం అవసరమని రమేశ్‌ జార్కిహొళి కోరారు.

యువతికి సిట్‌ తాజా నోటీసులు 
సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్‌ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్‌పార్కు పోలీసుల ఎదుటహాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆ యువతికి పోలీసులు  ఇప్పటివరకు ఆమెకు 8 సార్లు నోటీసులు పంపించినా ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. 

మా కూతురితో కొందరి రాజకీయం 
తమ కూతురు ఒత్తిడిలో ఉందని, ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోరాదని యువతి తల్లిదండ్రులు అన్నారు. ఆమెకు మానసిక కౌన్సిలింగ్‌ అవసరమని అన్నారు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలియదని, ఆమెను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేపీసీసీ నేత డీకే.శివకుమార్‌ చెప్పినట్లు నడుచుకుంటోందని యువతి సోదరుడు ఆరోపించారు.  

సీడీతో సంబంధం లేదు: డీకే 
బనశంకరి: సీడీ ఘటన తన కుట్రేనని సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అందించాలని యువతి తల్లిదండ్రులపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌ సవాల్‌చేశారు. సోమవారం రాయచూరు ముదగల్‌లో డీకేశి మాట్లాడుతూ తనకు సీడీలోని అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ అమ్మాయి వెనుక డీకే ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఒత్తిడిలో వారు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top