ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు వద్దన్న కాంగ్రెస్ అధిష్టానం
ప్రస్తుతం కర్ణాటకపై కాదు.. అస్సోంపై దృష్టి పెట్టాలని సూచన
జాతీయ రాజకీయాల్లోకి రావాలని డిప్యూటీ సీఎం డీకేకు ఆహ్వానం
సాక్షి బెంగళూరు/శివాజీనగర: త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వద్దని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కూడా సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుంది. అప్పటివరకు కర్ణాటకతో పాటు ఏ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చెయ్యొద్దని.. యథాతథ స్థితినే కొనసాగించాలని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలిసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు నాయకత్వ మార్పు విషయంలోగానీ ఇతర ఏ అంశాల్లో కూడా చర్చ అవసరంలేదని.. కర్ణాటకలో రాజకీయాల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని డీకే శివకుమార్‌కు అధిష్టానం స్పష్టంచేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ ఎన్నికలపై ప్రభావం పడకూడదనే..
నిజానికి.. కర్ణాటకలో బడ్జెట్‌కు ముందే తనకు సీఎం స్థానం కట్టబెట్టాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ మార్పుచేస్తే ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికలను హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కర్ణాటక రాజకీయాలపై కాకుండా అస్సోంలో గెలుపుపై దృష్టిసారించాలని డీకేకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. అయితే, ఈ ఎన్నికల తర్వాతైనా ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారా అని హైకమాండ్‌ను డీకే ప్రశ్నించగా.. ‘మీ కృషికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు ప్రతిఫలం తప్పక దక్కుతుంద’ని హైకమాండ్ బదులిచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
జాతీయ రాజకీయాల్లోకి రండి..
మరోవైపు.. అస్సోం శాసనసభ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అస్సోం రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకమాండ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి డీకే శివకుమార్‌తోనూ చర్చించినట్లు తెలిసింది. అక్కడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై డీకే శివకుమార్‌కు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం.
ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా డీకే సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే డీకే శివకుమార్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయని.. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా హైకమాండ్ కోరినట్లు చర్చ జరుగుతోంది.


