వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌! | Ketan Agrawal Like Horror: Girlfriend Pushed Into 1000 Foot Gorge | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!

Oct 13 2026 11:15 AM | Updated on Oct 13 2026 11:20 AM

Ketan Agrawal Like Horror: Girlfriend Pushed Into 1000 Foot Gorge

పెళ్లికి ముందు తనతో గడపాలని ఉందని చెప్పిన ఆ ‘సైకో ప్రియుడి’ మాటను ఆమె కాదనలేకపోయింది. సరదాగా డేటింగ్‌కు వెళ్లిన ఆ యువతికి అదే చివరి ప్రయాణమైంది. లోయలోకి తోసేసి చంపిన ఆ యువకుడు.. ఆపై అందరినీ ఏమార్చే ప్రయత్నం చేశాడు. కానీ, చివరకు పోలీసుల స్టైల్‌ ట్రీట్‌మెంట్‌తో జరిగిందంతా చెప్పేశాడు. యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ ఘటన జరిగిన మహారాష్ట్రలోనే.. అదే తరహాలో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.

కొల్హాపూర్‌ జిల్లా భూదర్‌గఢ్‌ తాలూకాకు చెందిన శ్రీపాద్‌ దినకర్‌ వదర్‌ (25), తరన్నుమ్‌ బషీర్‌ నాయక్‌ (23) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అక్టోబర్‌ 9న శ్రీపాద్‌.. తరన్నుమ్‌ను నైక్వాడి జలపాతం వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో నిఖా జరగాల్సి ఉంది. దీంతో తమ బంధాన్ని ఇక కొనసాగించలేనని ప్రియుడికి స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

అయితే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన శ్రీపాద్‌.. పక్కా స్కెచ్‌ వేశాడు. చివరిసారిగా ఆమెతో గడపాలని ఉందని మాటలు చెప్పాడు. ఆమె కరిగిపోయి.. బయటకు వచ్చేందుకు అంగీకరించింది. అలా ఆమెను జలపాతం వద్దకు తీసుకెళ్లి ఎవరూ గమనించనిది చూసి పైనుంచి లోతైన లోయలోకి తోసేశాడు.

ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..
తనపై అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు పథకం వేశాడు. శనివారం భూదర్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. ఇద్దరూ సెల్ఫీ తీసుకుంటుండగా తరన్నుమ్‌ ప్రమాదవశాత్తూ జారిపడి లోయలో పడిపోయిందని చెప్పాడు. అయితే అతడి మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా, చివరకు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు.

వెయ్యి అడుగుల లోతులో మృతదేహం..
పోలీసులు, సహాయక సిబ్బంది సుమారు వెయ్యి అడుగుల లోతులో ఉన్న తరన్నుమ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం కొల్హాపూర్‌లోని సీపీఆర్‌ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి మృతితో గ్రామంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితుడికి ఓ రాజకీయ నాయకుడితో సన్నిహిత సంబంధాలున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు విచారణపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. పుణేలో యువ వ్యాపారి కేతన్‌ అగర్వాల్‌ కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. జూన్‌ 18న లోహ్‌ఘడ్‌ కోట వద్ద కేతన్‌(26)ను లోయలోకి తోసేసి కాబోయే భార్య సియా గోయల్‌, ఆమె ప్రియుడు చేతన్‌ చౌద్రీ హత్య చేశారు. కేతన్‌తో వివాహం ఇష్టం లేకనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తర్వాత పోలీసుల దర్యా‍ప్తులో తేలింది. 

ఇదీ చదవండి: వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. ఏలూరులో విషాదకర ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement