ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి

Karnataka: Road Accident In Dharwad District - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం.. మొత్తం 11 మంది దుర్మరణం

వారంతా స్నేహితులు. నివాసాలు సమీపంలోనే. అందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పండుగలు, సెలవుల్లో సరదాగా గడుపుతారు. కనుమ పండుగ రోజు సరదాగా గడుపుదామని గోవా బయలుదేరిన వారికి మృత్యువు ఎదురొచ్చింది. ఇసుక టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చింది. ఆనందంగా గడుపుదామని వెళుతున్న 14 మందిలో తొమ్మిదిమందిని కబళించింది. వారిని తీసుకెళుతున్న వ్యాను డ్రైవర్, క్లీనర్ల ప్రాణాలను కూడా తీసింది.

సాక్షి బళ్లారి/హుబ్లీ: కర్ణాటకలో కనుమ పండుగ రోజు శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబ్లీ–ధార్వాడ బైపాస్‌ రోడ్డులో ధార్వాడ నగర సమీపంలోని ఇటగట్టి వద్ద టెంపో ట్రావెలర్, ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. దావణగెరెకు ఐఎంఏకు చెందిన 15 మంది లేడీ డాక్టర్లు గోవాలో సరదాగా గడుపుదామని శుక్రవారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. ధార్వాడలో స్నేహితురాలి ఇంట్లో అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. ఉదయం ఏడుగంటల సమయానికి వీరి వాహనం ఇటగట్టి వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్‌ నుజ్జునుజ్జయింది.

అందులోని తొమ్మిదిమంది మహిళలు, డ్రైవర్, క్లీనర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సంపన్న, రాజకీయ కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. ఇక మరణించిన వారిలో ఎక్కువ మంది గైనకాలజిస్టులే ఉన్నారు. వీరి మరణం సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాల రేటుపై ప్రభావం చూపగలదని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రమాద స్థలంలో కొన్ని మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటు చూసినా రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. టెంపో ట్రావెలర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద మధ్యాహ్నానికి బయటకు తీశారు. మృతదేహాలను హుబ్లీ కిమ్స్‌ ఆస్పత్రికి, గాయపడినవారిని హుబ్లీ, ధార్వాడల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్, ధార్వాడ రూరల్‌ పోలీసులు, అధికారులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. పొగమంచు వల్ల ఎదుటి వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 


ప్రయాణానికి ముందు మృతుల సెల్ఫీ

మృతులు: వర్షిత వీరేష్‌ (46), మంజుల నటేశ్‌ (47), రాజేశ్వరి శివకుమార్‌ (40), వీణాప్రకాష్‌ (47), హేమలత (40), పరంజ్యోతి (47), క్షీరా సురేష్‌ (47), ప్రీతి రవికుమార్‌ (46), యస్మిత (20), టెంపో ట్రావెలర్‌ డ్రైవర్‌ రాజుసోమప్ప (38), క్లీనర్‌ మల్లికార్జున (21)

గాయపడినవారు: పూర్ణిమ (36), ప్రవీణ (32), ఉషారాణి (30), వేద (46), ఆశా (47), టిప్పర్‌ డ్రైవర్‌ బసవరాజు

అందరూ స్నేహితులే: మృతుల్లో వీణాప్రకాష్, ప్రీతి రవికుమార్‌ వైద్యులు. మిగిలినవారు వైద్యరంగంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితులైన వీరు దావణగెరె విద్యానగర్, ఎంసీసీ ఏ, బీ బ్లాక్‌ లేఔట్‌లలో నివాసం ఉంటున్నారు.  

విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
కర్ణాటకలో ఘోరరోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్విటర్‌ ద్వారా తన సంతాపం తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top