అనంతబాబు డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Judgment reserved on Anantha Babu default bail petition - Sakshi

సాక్షి, అమరావతి: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయనందున  డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రవి బుధవారం విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. 90 రోజులకు రెండు రోజుల ముందు పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారని, సాంకేతిక కారణాలతో కోర్టు దానిని తిరస్కరించిందని తెలిపారు. ఇది అసంపూర్ణ చార్జిషీట్‌ కిందకే వస్తుందని, అందువల్ల డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చార్జిషీట్‌లో లోపాలున్నాయని కోర్టు తిరస్కరించిందని, వాటిని సవరించి తిరిగి దాఖలు చేశామన్నారు.

గడువులోపు దాఖలు చేసిన చార్జిషీట్‌ను సాంకేతిక కారణాలతో కోర్టు తిరస్కరిస్తే, దానిని సకాలంలో దాఖలు చేసినట్లుగానే భావించాలన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్‌ నివేదికలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో తాను ఎవరినీ సమర్థిస్తూ వాదనలు చెప్పడంలేదని, కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్నానని న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోండి
అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతబాబుకు నేర చరిత్ర ఉందన్నారు.

పోలీసులు గడువు లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top