కోరిక తీర్చాలంటూ వివాహితకు వేధింపులు 

Indecent behavior of a man in Maidambanda village - Sakshi

అడ్డుకున్న మరో మహిళ చేతిని కారు డోరులో ఇరికించి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

మైదంబండ గ్రామంలో కామాంధుడి అసభ్య ప్రవర్తన

గ్రామస్తులు వెంబడించడంతో పరార్‌

ముత్తారం (మంథని): పరుష పదజాలంతో దూషించడంతోపాటు అసభ్య సైగలు చేస్తూ ఓ కామాంధుడు తన కామవాంఛ తీర్చాలని వివాహితను వేధించాడు.. అడ్డుకోబోయిన మరో మహిళపై సైతం దాడిచేశాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం తన బాబును ఇంటి ఎదుట ఆడిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎర్రం సురేశ్‌ అక్కడకు చేరుకుని ఆమెను బూతులు తిడుతూ, అసభ్య సైగలతో కామవాంఛ తీర్చాలని వేధించాడు.

బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన సురేశ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి రాత్రి సమయంలో తన సహచరుడు రేగల గట్టయ్యతో కలిసి సురేశ్‌ కారులో మళ్లీ యువతి ఇంటికి చేరుకున్నాడు. సురేశ్, గట్టయ్య కలిసి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన స్థానికుడు బియ్యని కృష్ణస్వామిపై దాడికి దిగారు. తన భర్తను ఎందుకు కొడుతున్నావని కృష్ణస్వామి భార్య నవలోక దుండగులను ప్రశ్నించింది.

దీంతో ఆగ్రహించిన సురేశ్‌ గట్టయ్య సాయంతో కారు డోర్‌లో నవలోక చెయ్యి ఇరికించి సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు బైక్‌లతో వెంబడించినా నిందితుల ఆచూకీ లభించలేదు. తీవ్రంగా గాయపడ్డ నవలోకను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వివాహిత, బాధిత మహిళ కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

నిందితుల కారు దగ్ధం.. 
స్థానికులు వెంబడించడంతో నిందితులు తమ కారులో మైదంబండ నుంచి మచ్చుపేట, లక్కారం మీదుగా సర్వారం వెళ్లే రోడ్డు మీదుగా పరారయ్యారు. చివరికి సర్వారంలోని ఓ డ్రైనేజీలో కారు దిగబడి ఆగిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. అయితే, తెల్లవారేసరికి కారు కాలిపోయింది. ప్రమాదవశాత్తు కాలిపోయిందా, లేదా ఎవరైనా కాల్చివేశారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top