
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దుండగుల దాడి
టీడీపీ నాయకుల పనేనంటూ ఆరోపణలు
బాధితుడికి మాజీ ఎమ్మెల్యే శిల్పా పరామర్శ
మహానంది: అధికార పార్టీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బుసిగారి నాగరాజు తమ్ముడు సురేష్‌పై నలుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది.
బాధితుల వివరాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ గురువారం రాత్రి ఆర్‌ఎంపీ వద్ద వైద్యం పొంది ఇంటికి వస్తుండగా అయ్యలూరిమెట్ట సమీపంలోని చెరువు, గోదాం ప్రాంతంలో నలుగురు అటకాయించారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. సురేష్ ను స్థానికులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దౌర్జన్యాలు: శిల్పా
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇప్పటికే నాలుగు హత్యలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ ను ఆస్పత్రిలో పరామర్శించిన శిల్పా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఓ యువకుడిపైన, వైశ్యులతో పాటు మరికొందరిపైనా దాడి చేశారన్నారు. గ్రామాల్లో పదిమంది టీడీపీ నాయకులు ఉంటే తలా ఒక బెల్ట్‌షాప్, మంత్రులకు శాఖల తరహాలో టీడీపీ నాయకులకు దోపిడీ శాఖలు కేటాయించారని ఆరోపించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే దాడి చేసినా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు.